'దేశంలో గోవును బీజేపీ ఓట్లు ఇచ్చే రాజకీయ జంతువుగా మార్చింది'
చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ బీజేపీ పై విరుచుకపడ్డారు. బీజేపీ ఆవు పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
"ప్రపంచవ్యాప్తంగా ఆవులు పాలు ఇస్తాయి, కానీ భారతదేశంలో మాత్రం అవి ఓట్లను ఇస్తాయి" అని చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మన దేశంలో ఆవులను ఓట్లు ఇచ్చే రాజకీయ జంతువుగా బిజెపి మార్చేసిందని ఆయన ధ్వజమెత్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం రాయ్‌పూర్‌లోని షహీద్ స్మారక్ భవన్‌లో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. 'గాంధీ, యువత, నవ భారత సవాళ్లు' అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం బఘెల్ మాట్లాడారు. స్వయం ఉపాధితో స్వావలంబన అనేది గాంధేయ మార్గమని సీఎం అన్నారు.
"గాంధీజీ ఆవులను తల్లి కంటే ఎక్కువగా గౌరవించేవాడు. తన జీవితాంతం మనకు సేవ చేస్తుంది. మరణించిన తర్వాత కూడా, చర్మంతో బూట్లు, సంచులు, బెల్టులు, ఎముకలు ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు." అని ఆయన అన్నారు. అయితే ఈ రోజుల్లో ఆవు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని భూపేష్ బిజెపి పై మండిపడ్డారు. ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో అయినా ఆవులు పాలు ఇస్తాయని కానీ భారత్‌లో మాత్రం ఓట్లు ఇచ్చే రాజకీయ జంతువుగా బీజెపి మార్చిందని" సీఎం ఆరోపించారు.
గాంధీజీ భారతదేశ విభజన సమస్య వల్ల హత్యకు గురికాలేదు.. పాలక వర్గాల గుత్తాధిపత్యాన్ని, అరాచకాన్ని వ్యతిరేకించి సవాలు చేసినందునే హత్యకు గురయ్యాడన్నారు.
" గాంధీజీ ఉద్యమం అణగారిన వర్గాలకు గౌరవాన్ని తెచ్చి పెట్టింది. దళితులు, మాన్యువల్ స్కావెంజర్లు, చెప్పులు కుట్టేవారు, క్లీనర్లు, అనేక ఇతర వృత్తు వారికి సమాజంలో గౌరవం లభించడం ప్రారంభమైంది.శతాబ్దాలుగా వారి శ్రమను దోచుకుంటూ అవమానపరుస్తున్న పాలకవర్గాలు ఈ పరిణామాన్ని సహించలేకపోయాయి. దాంతో ఆ మహాత్ముణ్ణి చంపేశారు'' అని సీఎం ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ వంటి కరడుగట్టిన హిందూ సంస్థల పేర్లు ప్రస్తావించకుండా ఆ సంస్థలపై సీఎం తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
బీజేపీ కూడా బాఘెల్ ప్రకటనలను కౌంటర్ ఆరోపణలతో తిప్పికొట్టింది. విపక్ష నాయకుడు నారాయణ చందేల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బిజెపి విధానాల పట్ల ఆందోళన చెందే కంటే తన సొంత పార్టీ గురించి ఆలోచిస్తే ఆయన ఆరోగ్యానికి, పార్టీకి మంచిది అన్నారు. ముఖ్యమంత్రి గోశాలలు నిర్మించారు కానీ వాటికి అక్కడ ఆహారం దొరక్క చనిపోతున్నాయి. అనేక ఆవులు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాల్లో మరణిస్తున్నాయని అన్నారు.