ఫిరాయింపుదారులకు అడ్డా... 8 యేళ్ళలో 211 మంది ఎమ్మెల్యేలు,ఎంపీలను చేర్చుకున్న బిజెపి
భారతీయ జనతా పార్టీ ఈ ఎనిమిదేళ్ళలో ఇతర పార్టీలకు చెందిన 211 మంది ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుండి 177 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరారని ఎడిఆర్ నివేదిక తెలిపింది.
జెడి-యు అధినేత నితీష్ కుమార్ బీహార్‌లో బిజెపితో తెగదెంపులు చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఆయనకు బిజెపి షాకిచ్చింది. శుక్రవారంనాడు మణిపూర్‌లోని ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) శాసనసభ్యులలో ఐదుగురు రాష్ట్ర అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. చేరారు అనే కంటే బిజెపి చేర్చుకుంది అనడం సబబుగా ఉంటుంది. విపక్షాలను బలహీనపర్చాలనే ఆలోచనతో కాషాయ పార్టీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చేస్తున్న ప్రయత్నాలు అంతా చూస్తున్నదే . బిజెపి కుయుక్తులను పసిగట్టిన నితీష్ కుమార్ ముందుగా మేల్కొని తన పాత మిత్రులు ఆర్జెడి, కాంగ్రెస్ తదితర పార్టీలతో
కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అరుణా చల్ ప్రదేశ్ లో తాను ఆయన పార్టీకి చేసిన ద్రోహాన్ని మరిచిపోయింది, బిహార్ లో నితీష్ తమతో విడిపోవడాన్నే ద్రోహంగా భావించి మణిపూర్ లో జెడియు ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ పార్టీలో చేర్చుకుంది. ఇలా దేశవ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు తమతమ పార్టీలను వీడి కాషాయ పార్టీలో చేరారు. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ చెంతకు చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 211కి చేరిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో బిజెపి నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 60 మంది అని తెలిపింది.
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను అస్థిరపరిచి అధికారంలోకి రావాలనే కాంక్షతోనే బిజెపి తన అధికారాన్ని ఉపయోగించి ఈడి,సిబిఐ, ఐటి వంటి కేంద్ర సంస్థలను ప్రయోగించి నయానో భయానో బెదిరించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను , ఎంపీలను కొనుగోలు చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు బిజెపి ఎటువంటి వెరపు లేకుండా తన కుటిల ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.
"బిజెపి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని జెడియూ అధికార ప్రతినిధి పరిమళ కుమార్ అన్నారు.
బిజెపి, ఎన్‌డిఎ రాజ్యాంగ సూత్రాలను, మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నందున, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లనే ఆ కూటమి లో భాగస్వాములైనవారు క్రమంగా వారిని విడిచి దూరంగా పోతున్నారు."అని ఆయన అన్నారు. అందుకే జెడి-యు బిజెపితో విడిపోయిందని చెప్పారు.
అయితే బిజెపి ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తోంది. హేమంత్ బివశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు ఆ పార్టీలో ఇమడలేక వారి పోకడలు నచ్చకపోవడం వల్లనే తమ పార్టీలో చేరారని బిజెపి అధికార ప్రతినిధి గురుప్రకాష్ పాశ్వాన్ చెప్పారు. జెడియు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నారని, వారు అలా అనుకుంటే కోర్టుకు వెళ్ళ వచ్చని ఆయన చెప్పారు.
ఏ పార్టీ నుంచి ఎంతమంది..
కాంగ్రెస్ పార్టీ 2014 నుండి 2021 వరకు 177 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను కోల్పోయిందని ఎడిఆర్ తెలిపింది. ఆ పార్టీ నుంచి 2021 వరకు 76 మందిని, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మందిలోకలిపి మొత్తం 84 మంది బిజెపిలో చేరారు. ఇతర పార్టీలలో.. బిఎస్పి 21 మంది శాసనసభ్యులను, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నుంచి 17 మందిని, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పి) నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు.
2014 -2021 మధ్య, జెడియు నుంచి బిజెపిలో కి ఫిరాయింపుల సంఖ్య తక్కువగా ఉందని, ఆ కాలంలో మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే మారారని నివేదిక తెలిపింది. ఒకప్పుడు బిజెపికి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2018లో విడిపోయే వరకు మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది. ఈ ఫిరాయింపులు ఎన్నికలకు ముందుతరువాత జరిగినవని నివేదిక తెలిపింది.
2017 నుంచి 2022 మధ్య కాలంలో ఫిరాయించిన మొత్తం 85 మంది ఎమ్మెల్యేలు ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసినట్టు డేటా పేర్కొంది. కేవలం ఎన్నికల సమయంలోనే ఫిరాయింపులు జరగలేదని కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలు 2020లో మూకుమ్మడి రాజీనామాలు చేసి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఈ తిరుగుబాటుకు అప్పటి కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరి రాజ్యసభ సభ్యుడు ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు.
కర్ణాటకలో, 2019లో, హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అప్పటి అధికార కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. 16 మంది రెబల్స్‌లో 13 మంది 2020 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు.
గత దశాబ్దంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అత్యధిక సంఖ్యలో ఈ ఫిరాయింపుదారులనే పోటీలో దించిందని ది హిందూ నివేదిక పేర్కొంది. మొత్తం 830 మంది పోటీ చేయగా కేవలం 44 శాతం మంది మాత్రమే గెలిచారని పేర్కొంది.