Telugu Global
National

బీజేపీ సంచలనం.. మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌యాదవ్‌

ఎన్నికలు జరిగిన వెంటనే మధ్యప్రదేశ్‌కు సెంట్రల్‌ అబ్జర్వర్లను నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో ఈసారి ముఖ్యమంత్రి మార్పు తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.

బీజేపీ సంచలనం.. మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌యాదవ్‌
X

మధ్యప్రదేశ్‌ సీఎం ఎవరన్న అంశంపై వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది. మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. భోపాల్‌లో జరిగిన లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు పార్టీ సెంట్రల్‌ అబ్జర్వర్లు. ఈ సమావేశానికి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 163 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరుసగా ఐదోసారి సీఎం కావాలనుకున్న శివరాజ్‌ సింగ్ అభ్యర్థనను పక్కన పెట్టిన బీజేపీ అధిష్టానం.. ఈసారి మోహన్‌ యాదవ్‌ పేరును అనూహ్యంగా తెరపైకి తెచ్చింది.

మోహన్ యాదవ్‌ 2013 ఎన్నికల్లో ఉజ్జయిన్‌ సౌత్‌ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు మోహన్ యాదవ్‌. RSSకు మోహన్ యాదవ్ అత్యంత విధేయుడని పేరు ఉంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల పేరును సైతం బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. జగదీశ్‌ దియోరా, రాజేశ్‌ శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించింది. ఇక కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు స్పీకర్ పదవి కట్టబెట్టింది.

ఎన్నికలు జరిగిన వెంటనే మధ్యప్రదేశ్‌కు సెంట్రల్‌ అబ్జర్వర్లను నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో ఈసారి ముఖ్యమంత్రి మార్పు తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. చివరగా 2005లో మధ్యప్రదేశ్‌ సీఎం ఎంపిక కోసం సెంట్రల్ అబ్జర్వర్లను నియమించింది బీజేపీ అధిష్టానం. ఆ టైమ్‌లో బాబు లాల్ గౌర్ సీఎం పదవి నుంచి తప్పుకోవడంతో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎంగా ఎంపిక చేశారు పార్టీ అబ్జర్వర్లు. అప్పటి నుంచి ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు. 2018లో మెజార్టీ రాకపోవడంతో దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిపక్షంలో కూర్చున్నారు శివరాజ్ సింగ్. తర్వాత సింథియా తన వర్గంతో బీజేపీలో చేరడంలో మళ్లీ సీఎం పదవిని అధిష్టించారు. 2005 నుంచి దాదాపు 16 ఏళ్లకుపైగా సీఎం పదవిలో కొనసాగారు శివరాజ్‌. 2003 నుంచి మధ్యప్రదేశ్‌కు ఓబీసీ వర్గానికి చెందిన వారే సీఎంలుగా ఉంటూ వస్తున్నారు. ఉమాభారతి, బాబులాల్‌ గౌర్‌, శివరాజ్‌ సింగ్ ఓబీసీ వర్గానికి చెందిన వారే. మధ్యప్రదేశ్‌ జనాభాలో ఓబీసీ జనాభా 48 శాతంగా ఉంది.

నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా.. వరుసగా ఐదు విడతల ప్రజా వ్యతిరేకతను అధిగమించి బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 66 స్థానాలకు పరిమితమైంది. మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయనకు పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి గిరిజన నేత విష్ణు దేవ్ సాయ్‌ను ఎంపిక చేసిన బీజేపీ.. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఇక రాజస్థాన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈసారి వసుంధర కాకుండా కొత్తవారిని సీఎం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

First Published:  11 Dec 2023 6:23 PM IST
Next Story