బిగ్‌షాక్.. మైనారిటీలో పడిపోయిన బీజేపీ ప్రభుత్వం
బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు నాయబ్ సింగ్ సైనీకి లేదని హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కష్టాల్లో పడింది. ఇంతకాలం బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఆరుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ముగ్గురు మద్దతు ఉపసంహరించున్నారు. ఈ మేరకు హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు.
కాంగ్రెస్‌కు మద్దతు..
లోక్‌సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గొల్లెన్, ధరమ్‌పాల్ గొండెర్ ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు తీవ్రమయ్యాయని ఆరోపించారు.
సీఎం రాజీనామా..!
బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు నాయబ్ సింగ్ సైనీకి లేదని హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ తెలిపారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు జేజేపీ సెక్రటరీ జనరల్ దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హూడాతో చర్యలు జరిపారు.