Telugu Global
National

బీజేపీ విస్తారక్ భేటీ అంతా రహస్యమే.. బలహీనంగా ఉన్న 117 సీట్లపై చర్చ?

విస్తారక్‌ల భేటీకి 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 110 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

బీజేపీ విస్తారక్ భేటీ అంతా రహస్యమే.. బలహీనంగా ఉన్న 117 సీట్లపై చర్చ?
X

బీజేపీ దక్షిణాది రాష్ట్రాల విస్తారక్ (ఫుల్‌టైమర్స్)ల భేటీ హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమయ్యాయి. పార్టీకి, ఆర్ఎస్ఎస్‌కు మధ్య అనుసంధానంగా ఉండే విస్తారక్‌లు ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తారు. బూత్ కార్యకర్తల నుంచి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతల వరకు ఈ విస్తారక్‌ల ఆదేశాలను పాటించాల్సిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని షామీర్ పేటలో విస్తారక్‌ల సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం (29న) రెండో రోజు బీజేపీ జాతీయ సంస్థాగత బాధ్యుడు బీఎల్ సంతోశ్ కూడా హాజరుకానున్నారు.

విస్తారక్‌ల భేటీకి 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 110 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనంగా ఉన్న 117 లోక్‌సభ స్థానాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. దక్షిణాది రాష్ట్రాల్లోనే పార్టీ చాలా బలహీనంగా ఉందని.. ఈ సారి మరిన్ని సీట్లు గెలుచుకునేలా 23-పాయింట్ల ఫార్ములాను అనుసరించాలని నాయకులు ప్రతిపాదించారు. ఈ ఫార్ములా అమలు చేస్తే 60 శాతం ఓట్లు బీజేపీకి పడతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ విస్తారక్‌ల సమావేశాలను పూర్తి రహస్యంగా నిర్వహిస్తున్నారు. కనీసం మీడియా, ఇతర వ్యక్తులకు కూడా ఈ సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన అంతర్గత సమావేశాలని.. బయటకు చెప్పాల్సిన అవసరం లేదని నాయకులు స్పష్టం చేస్తున్నారు. 16 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల్లో గెలిచే అభ్యర్థులు ఎవరో గుర్తించాలని విస్తారక్‌లకు దిశానిర్దేశనం చేశారు. ఇక బలహీనంగా ఉన్న పార్లమెంటు స్థానాల్లో బూత్ కమిటీలు వెంటనే వేయాలని.. అలాగే ఆయా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించారు.

ఇక తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు గెలిచిన అదిలాబాద్ సహా ఇతర పార్లమెంటు సీట్లపై దృష్టి పెట్టాలని విస్తారక్‌లకు చెప్పారు. ప్రతీ విస్తారక్ తమకు కేటాయించిన పార్లమెంటు సీటులో బీజేపీ గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నా.. ఆయా లోక్‌సభ స్థానాలకు సూట్ అయ్యేలా ప్రణాళిక రచించాలని చెప్పారు. బలహీనంగా ఉన్న సీట్లలో మరింత ఎక్కువగా పని చేయాలని.. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులను చేర్చుకునే విషయంపై కూడా దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తున్నది. మొత్తానికి దక్షిణాదిలో ఈ సారి గణనీయంగా లోక్‌సభ స్థానాలు పెంచుకోవడమే ఈ సమావేశాల లక్ష్యంగా కనపడుతోంది.

First Published:  29 Dec 2022 6:32 AM IST
Next Story