Telugu Global
National

సోనియా గాంధీపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ అభ్యంతరం తెలిపింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే స్పందిస్తూ.. సోనియా వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం.. ఆమోదయోగ్యం కాదని అన్నారు.

సోనియా గాంధీపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు
X

కర్ణాటకలో ఎన్నికలకు ఇక కొన్ని గంటలే మిగిలి ఉండగా.. రాజకీయాలు మాత్రం అక్కడ మరింత హీట్ పెంచుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమె తన ప్రసంగంలో సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించడం పట్ల ఆ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ కర్ణాటకలోని హుబలి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ చూస్తుందని.. ఇందుకు భంగం కలిగించే వారిని ఎవరినీ అనుమతించబోమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

అయితే సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ అభ్యంతరం తెలిపింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే స్పందిస్తూ.. సోనియా వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం.. ఆమోదయోగ్యం కాదని అన్నారు. సార్వభౌమాధికారం అనే పదాన్ని దేశానికి మాత్రమే ఉపయోగిస్తారని, ఆ పదాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించిన సోనియా గాంధీ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

మరో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ సోనియాగాంధీ సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే వాడారని విమర్శించారు. కాగా ఈ విషయమై భూపేంద్ర యాదవ్ సారథ్యంలో ఎంపీలు జితేంద్ర ప్రసాద్, తరుణ్ చుగ్, అనిల్ బలూని, ఓమ్ పాఠక్ ఎన్నికల సంఘాన్ని కలిసి సోనియా గాంధీపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు ఈసీని కోరారు.

కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే బ‌జరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ కొద్ది రోజుల కిందట ప్రకటించింది. ఇది తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటకలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బ‌జరంగ్ దళ్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. మోడీ రోడ్ షోలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పుడు సోనియా గాంధీ వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ వివాదంలో చిక్కుకుంది.

First Published:  8 May 2023 1:05 PM GMT
Next Story