ఉద్యోగాల విషయంలో బీజేపీ సర్కారు భారీ మోసం..
ఉన్నఫళంగా కోటి ఉద్యోగాలు, ఆ తర్వాత ఏడాదికి 20లక్షల ఉద్యోగాలంటూ యువతను మోసం చేసిన మోదీ, అత్యథిక నిరుద్యోగిత మార్కుని అందుకున్న అసమర్థ ప్రధానిగా రికార్డ్ సృష్టించారు.
తాము అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన మోదీ, ఆ తర్వాత ఏ రేంజ్ లో మాట తప్పారో నిరూపించే ఉదాహరణ ఇది. మోదీ గద్దెనెక్కిన తర్వాత ఇప్పటి వరకూ ఏ ఒక్క ఏడాది కూడా 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దీనిపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం కేంద్రం అసమర్థతకు నిదర్శనంగా మారింది.
అసలు ప్రభుత్వ రంగంలో బీజేపీ సర్కారు భర్తీ చేసిన ఉద్యోగాలెన్ని, ఇప్పుడు ఉన్న ఖాళీలెన్ని అంటూ లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ దీపక్ బైజ్. దీనికి కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో నరేంద్రమోదీ చెప్పిన మాటలకు, ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణకు అసలు పొంతనే లేకుండా పోయింది. ఖాళీగా ఉన్న పోస్ట్ లు ఎన్ని, భర్తీ చేసినవి ఎన్ని, అందులో బ్యాక్ లాగ్ పోస్ట్ లు ఎన్ని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని అంటూ వివరంగా ప్రశ్నలు సంధించారు దీపక్ బైజ్.
మొత్తం 78విభాగాలకు సంబంధించిన ఉద్యోగాల డేటాను కేంద్ర మంత్రి సమాధానంగా అందించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 78 విభాగాల్లో ఇప్పటి వరకు 40,35,203 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 30,55,876 ఖాళీలు భర్తీ అయ్యాయి. 2021 మార్చి 1 నాటికి 9,79,327 ఖాళీలు ఉన్నట్టు మంత్రి సమాధానమిచ్చారు. ఇక బ్యాక్ లాగ్ పోస్ట్ ల వివరాలు ఆయా శాఖల వద్ద ఉంటాయని చెప్పారు.
కోటి ఉద్యోగాల సంగతేంటి..
ఇప్పటి వరకు కేవలం 40.35 లక్ష ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లు ఇస్తే అసలు కోటి ఉద్యోగాల సంగతేంటి అనే ప్రశ్న వినపడుతోంది. ఇంకా 9.79 లక్షల ఉద్యోగాల భర్తీ పెండింగ్ లో పడిపోవడానికి కారణం ఏంటి..? వీటన్నిటికీ ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఉన్నఫళంగా కోటి ఉద్యోగాలు, ఆ తర్వాత ఏడాదికి 20లక్షల ఉద్యోగాలంటూ యువతను మోసం చేసిన మోదీ, అత్యథిక నిరుద్యోగిత మార్కుని అందుకున్న అసమర్థ ప్రధానిగా రికార్డ్ సృష్టించారు. 2024 సార్వత్రిక ఎన్నికలనాటికి భారత దేశంలో నిరుద్యోగ సమస్య ఎన్నికల ప్రధాన అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.