Telugu Global
National

అర్థరాత్రి అత్యవసర భేటీ.. బీజేపీ కలవరపాటుకి కారణాలేంటి..?

ప్రధాని మోదీ ఇంట్లో జరిగిన సమావేశంలో మేనిఫెస్టో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. అభ్యర్థుల జాబితాపై కూడా కసరత్తులు మొదలు పెట్టాలని తీర్మానించారు.

అర్థరాత్రి అత్యవసర భేటీ.. బీజేపీ కలవరపాటుకి కారణాలేంటి..?
X

ఈ ఏడాది నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు మరికొన్ని అసెంబ్లీలు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలవరపడుతోంది. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించునేందుకు పావులు కదుపుతోంది, ప్రతిపక్షాల బలాబలాలు అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఇంట్లో అర్థరాత్రి బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.

ప్రధాని మోదీ ఇంట్లో బుధవారం బాగా పొద్దుపోయిన తర్వాత బీజేపీ వ్యూహ కమిటీ సమావేశమైంది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తోపాటు మరికొందరు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 5గంటలపాటు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అర్థరాత్రి దాటేవరకు మంతనాలు సాగుతూనే ఉన్నాయి.

కలవరపాటు..

ఇటీవల కర్నాటకలో బీజేపీకి కాంగ్రెస్ షాకిచ్చింది, ఈ ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారాన్ని కోల్పోయే అవకాశాలే ఎక్కువ. రాజస్థాన్, తెలంగాణ, చత్తీస్ ఘడ్ లో కమలదళం నీరసంగానే ఉంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. అందుకే బీజేపీ నేతలు హడావిడి పడుతున్నారు.

విపక్షాల ఐక్యత..

అందరూ కలసిరాకపోయినా.. బీజేపీని వ్యతిరేకించే 17 పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలో పనిచేయడానికి సిద్ధం కావడం, ఇటీవల పాట్నాలో భేటీ కావడం కూడా ఆసక్తికర పరిణామం. అప్పటినుంచి బీజేపీలో భయం మరింత పెరిగింది. 2019కి 2024కి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అప్పటికి కాంగ్రెస్ ఇంకా బలహీనంగానే ఉంది, ప్రతిపక్షాల కుమ్ములాట బీజేపీకి బాగా పనికొచ్చింది. కానీ ఈసారి రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ పుంజుకుంది, కర్నాటక ఫలితాలతో హస్తం పార్టీలో ఆ ఉత్సాహం మరింత పెరిగింది. అదే సమయంలో బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోతోంది. సామాన్యులపై ధరాభారం, అస్తవ్యస్థ ఆర్థిక విధానాలు ఆ పార్టీ పరువు తీసేశాయి. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న వేళ, అధికారాన్ని నిలబెట్టుకోడానికి బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే.

ప్రధాని మోదీ ఇంట్లో జరిగిన సమావేశంలో మేనిఫెస్టో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. అభ్యర్థుల జాబితాపై కూడా కసరత్తులు మొదలు పెట్టాలని తీర్మానించారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు కూడా బీజేపీ సిద్ధపడుతోంది. వీటన్నిటిపై మోదీ ఇంట్లో చర్చ జరిగింది.

First Published:  29 Jun 2023 11:39 AM IST
Next Story