Telugu Global
National

శరద్ పవార్ కు పత్రా చాల్ ఉచ్చు! ద‌ర్యాప్తున‌కు బిజెపి డిమాండ్

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ అరెస్ట‌యిన ప‌త్రా చాల్ కేసులోకి శ‌ర‌ద్ ప‌వార్ ను లాగే ప్ర‌య‌త్నం చేస్తోంది బిజెపి. ఈ కేసులో శ‌ర‌ద్ ప‌వార్ పాత్ర‌పై విచారణ జ‌ర‌పాల‌ని బిజెపి డిమాండ్ చేసింది. ప‌త్రా చాల్ రీ డెవ‌లెప్ మెంట్ ప‌నుల‌కు సంబంధించిన డెవ‌ల‌ప‌ర్ ను నిర్ణ‌యించ‌డంలో ప‌వార్ 'రింగ్ మాస్టర్' గా వ్య‌వ‌హ‌రించార‌ని బిజెపి శాసనసభ్యుడు అతుల్ భత్ఖల్కర్ ఆరోపించారు.

శరద్ పవార్ కు పత్రా చాల్ ఉచ్చు! ద‌ర్యాప్తున‌కు బిజెపి డిమాండ్
X

ఓ వైపు విప‌క్ష‌పాలిత రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వాల‌ను అస్థిర‌పరుస్తూన్న బిజెపి మ‌రో వైపు త‌మ‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతున్న నాయ‌కుల‌ను కూడా ఇబ్బందుల‌కు గురి చేస్తూ లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే అనేక మంది విప‌క్ష నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వేధిస్తూ మ‌నోవేద‌న‌కు గురి చేస్తున్న సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా మాజీ కేంద్ర మంత్రి , ఎన్ సిపి అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ పై గురి పెట్టింది. శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ అరెస్ట‌యిన ప‌త్రా చాల్ కేసుకు సంబంధించి శ‌ర‌ద్ ప‌వార్ ను కూడా ఆ ఉచ్చులోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తోంది బిజెపి.

పత్రా చాల్‌ రీడెవలప్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత, ఈ కేసులో శ‌ర‌ద్ ప‌వార్ పాత్ర‌పై విచారణ జ‌ర‌పాల‌ని బిజెపి డిమాండ్ చేసింది. ప‌త్రా చాల్ రీ డెవ‌లెప్ మెంట్ ప‌నుల‌కు సంబంధించిన డెవ‌ల‌ప‌ర్ ను నిర్ణ‌యించ‌డంలో ప‌వార్ 'రింగ్ మాస్టర్' గా వ్య‌వ‌హ‌రించార‌ని బిజెపి శాసనసభ్యుడు అతుల్ భత్ఖల్కర్ ఆరోపించారు. ఈ విష‌య‌మై శరద్ పవార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యశ్వంతరావు చవాన్ సెంటర్‌లో సమావేశమై చ‌ర్చించార‌ని, అందువ‌ల్ల ఆయ‌న పాత్ర‌పై కూడా స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని అతుల్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న హోం శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక లేఖ‌ రాశారు.

''పత్రా చాల్‌ను తిరిగి అభివృద్ధి చేసేందుకు గురు ఆశిష్‌ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడం కోసం పవార్‌, సంజయ్‌ రౌత్‌ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ తీర్మానం మార్చేశారు. ఆ తర్వాత రాకేష్ వాధావన్ తెర‌పైకి వచ్చారు. మరాఠీ లను నిరాశ్రయులను చేసేందుకు పవార్, సంజ‌య్ రౌత్, శివసేన, కాంగ్రెస్‌ల పాత్ర ఏంటో ఈ విచారణలో తేలాల్సి ఉంది. నిర్దిష్ట కాల ప‌రిమితిలో విచారణ జరిపించాలి.'' అని మాజీ హౌసింగ్ సెక్రటరీ లేఖను ఉటంకించారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా ఉన్నప్పటికీ, బయటి శ‌క్తుల నుంచి ఒత్తిడి వచ్చిందని భత్ఖల్కర్ పేర్కొన్నారు.

"ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలి. అవినీతి ఎక్కడ ఉందో, అక్కడ పవార్ ఉన్నాడు" అని భత్ఖల్కర్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ''పవార్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి'' అని భత్ఖల్కర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర యూనిట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే కూడా భత్ఖల్కర్ డిమాండ్‌ను సమర్థించారు. ఈ విష‌యంలో హోంమంత్రి విచారణ జరిపించాలని కోరారు.

భత్ఖల్కర్ డిమాండ్‌కు ట్రిగ్గర్ ఇడి ఛార్జ్ షీట్

''2006-07లో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి ప‌వార్ అధ్యక్షతన ఎంహెచ్ ఎడిఎ అధికారులతో జ‌రిగిన స‌మావేశంనికి, మాజీ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశాలకు సంజ‌య్ రౌత్ హాజరయ్యాడు. ఆ తర్వాతే, గురు ఆశిష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డెవలపర్ రాకేష్ వాధావన్ పాత్ర చాల్ రీడెవలప్‌మెంట్‌ను చేపట్టడానికి రంగంలోకి వ‌చ్చార‌ని ఈడి చార్జి షీట్ దాఖ‌లు చేసింది. దాని ఆధారంగా భత్ఖల్కర్ ఈ డిమాండ్ చేశారంటున్నారు.

నిరాధార ఆరోప‌ణ‌లు : ఎన్సీపి

అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌ను ఎన్ సిపి ఖండించింది. ఇవ‌న్నీ నిరాధారమైన‌. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని పేర్కొంది. ఈ విష‌య‌మై ప‌వార్ కుమార్తె ఎన్ సిపి ఎంపి సుప్రియ సూలే స్పందిస్తూ .. ఛార్జ్ షీట్‌లో త‌న‌ తండ్రి పేరు ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ''ఈడీ పేపర్లు లీక్ అవుతున్నాయా? ఇది చాలా తీవ్ర‌మైన అంశం. దేశంలో ఏం జ‌రుగుతోంది. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై చర్చిస్తాను. నేను దేశం గురించి ఆందోళన చెందుతున్నాను.'' అని భత్ఖల్కర్ పేరు ప్ర‌స్తావించ‌కుండా, అభియోగాలు మోపుతున్న వారి వద్ద అందుకు సంబంధించిన అవసరమైన కాగితాలు ఉన్నాయా అని సూలే ప్రశ్నించారు.

బీజేపీ అబద్ధాలను వ్యాపింపజేస్తోందని, శరద్ పవార్‌కు భత్ఖల్కర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే డిమాండ్ చేశారు. ''ఇప్పుడు శరద్ పవార్‌పై తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేశారు. వారి మాట‌ల్లో నిజాలు ఉండ‌వు. మహారాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని చాలా కాలంగా గ్రహిస్తున్నారు.'' అని ఆయన అన్నారు.

First Published:  21 Sept 2022 4:17 PM IST
Next Story