Telugu Global
National

సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేపీ డేంజర్ గేమ్

ఇప్పటికిప్పుడు ఈ వ్యూహంతో బీజేపీ సంబరపడొచ్చు కానీ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అసహ్యించుకుంటారనే వాదన మొదలైంది.

సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేపీ డేంజర్ గేమ్
X

కర్నాటకలో బీజేపీ ఎందుకంత ఘోరంగా ఓడిపోయింది..?

అవినీతి ఆరోపణలతోపాటు గత ప్రభుత్వాన్ని కూలదోసి అక్రమంగా బీజేపీ గద్దెనెక్కడాన్ని అక్కడి ప్రజలు అసహ్యించుకున్నారు.

రాబోయే మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి బీజేపీ ఎందుకు కలవరపడుతోంది..?

అక్కడ కూడా కాంగ్రెస్ ని ముక్కలు చేసి మధ్యలోనే గద్దనెక్కిన బీజేపీ ప్రభుత్వం రోజులు లెక్కబెట్టుకునే స్టేజ్ లో ఉంది.

చేసిన తప్పులకు పశ్చాత్తాపం అనుభవిస్తూ మళ్లీ మహారాష్ట్రలో ఈ డేంజర్ గేమ్ ఎందుకు..?

ఈ ప్రశ్నే ఇప్పుడు ప్రజాస్వామ్య వాదులను కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే శివసేనను నిట్టనిలువునా చీల్చేసింది బీజేపీ, ఇప్పుడు ఎన్సీపీని కూడా ముక్కలు చేసింది. గతంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను లాక్కోవడం పార్టీలకు రివాజు, కానీ ఇక్కడ పార్టీలనే ముక్కలు చెక్కలు చేసి వికృత రాజకీయ క్రీడకు తెరతీస్తోంది బీజేపీ. సీఎం కుర్చీ శివసేన చీలిక వర్గానికి ఇచ్చి షిండేని సంతృప్తి పరచిన బీజేపీ, ఇక్కడ ఎన్సీపీకి మరో ఉపముఖ్యమంత్రి పదవి సహా మొత్తం 9 పదవుల్ని ఆఫర్ చేసింది. అజిత్ పవార్ కి ఎరవేసి లాక్కొంది.

డేంజర్ గేమ్..

మహారాష్ట్రలో బీజేపీ, షిండే సేన కూటమికి ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకే బీజేపీ, ఎన్సీపీని విడగొట్టింది. ఒకరకంగా షిండే వర్గం తోకజాడించకుండా చేసింది. మహారాష్ట్ర వరకు ఓకే కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ డేంజర్ గేమ్ ప్రభావం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ లో చీలిక ఎన్సీపీ, ఆ పార్టీని చీల్చి ఇప్పుడు బీజేపీ సంబరపడుతోంది. ఇప్పటికిప్పుడు ఈ వ్యూహంతో బీజేపీ సంబరపడొచ్చు కానీ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అసహ్యించుకుంటారనే వాదన మొదలైంది. ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఆ విష సంస్కృతిని వ్యాపింపజేస్తూ బీజేపీ ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ చివరకు ఆ పార్టీకే నష్టం చేకూర్చే రోజు వస్తుందని అంటున్నారు. ఇప్పటికే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో ఈ విషయం రుజువైంది. మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి ఫలితమే వస్తే.. కచ్చితంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ ఖాయం.

First Published:  2 July 2023 4:55 PM IST
Next Story