Telugu Global
National

బీజేపీ ఐదో జాబితా.. మండీ నుంచి బరిలో కంగనా

హీరోయిన్ కంగనా రనౌత్ కి బీజేపీ టికెట్ కేటాయించింది. ఆమె సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది.

బీజేపీ ఐదో జాబితా.. మండీ నుంచి బరిలో కంగనా
X

లోక్‌సభ ఎన్నికల కోసం 111 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో తెలంగాణకు సంబంధించి రెండు సీట్లు ఉన్నాయి. వరంగల్‌ నుంచి ఆరూరి రమేశ్‌, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌ రావుకు బీజేపీ అధిష్టానం టికెట్లు ఖాయం చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు కమలదళం అభ్యర్థులను ప్రకటించినట్టయింది. ఏపీలో పొత్తులో భాగంగా లభించిన 6 లోక్ సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.


కంగనాకు మండీ..

అనుకున్నట్టుగానే హీరోయిన్ కంగనా రనౌత్ కి ఈసారి బీజేపీ టికెట్ కేటాయించింది. ఆమెకు సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇటీవలే బీజేపీలో చేరిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యకు బెంగాల్‌లోని తామ్‌లుక్ సీటు కేటాయించింది. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ పార్టీతో పొత్తు ఉండడంతో సంభల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్రలను పోటీకి నిలబెట్టింది బీజేపీ.

వరుణ్ గాంధీకి నో ఛాన్స్..

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీని వీడిన నవీన్‌ జిందాల్‌కు కురుక్షేత్ర టికెట్‌ను కేటాయించింది బీజేపీ. ఫిలిభిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్ గాంధీకి టికెట్‌ నిరాకరించడం విశేషం. ఆయన స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన జితిన్‌ ప్రసాదకు బీజేపీ ఎంపీ టికెట్‌ ఇచ్చింది. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను కేటాయించారు. రామాయణం టీవీ సీరియల్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌కు మీరట్‌ సీటు కేటాయించగా.. కేరళలోని వయనాడ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకు ప్రత్యర్థిగా సీనియర్ నేత కె.సురేంద్రన్‌ పేరుని బీజేపీ ప్రకటించింది.

First Published:  24 March 2024 5:21 PM GMT
Next Story