Telugu Global
National

బెంబేలెత్తిస్తోన్న బిపర్‌జాయ్‌

పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో రెస్క్యూ ఆపరేషన్ల కోసం 18 నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాండ్‌ ఫోర్స్‌, 12 ఎస్‌డీఆర్ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధంచేసింది. నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, కోస్ట్‌ కార్డ్‌ సిబ్బందిని రంగంలోకి దింపింది.

బెంబేలెత్తిస్తోన్న బిపర్‌జాయ్‌
X

బిపర్‌‌జాయ్‌ తుపాను గుజరాత్‌‌ను వణికిస్తోంది. ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను గుజరాత్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ సమీపంలో తీరాన్ని తాకింది. తుపాను తీరాన్ని తాకడంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ కుంభవృష్టి కురుస్తోంది. ద్వారక, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 8 జిల్లాల్లోని లక్ష మంది తాత్కాలిక ఆవాసాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో 8,900 మంది పిల్లలు, 1,131 మంది గర్భిణులు, 4,697 మంది పెద్దలు ఉన్నారు. వీరి కోసం మొత్తం 1,521 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు.



తుపాను అర్ధరాత్రి సమయంలో పూర్తిగా తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ద్వారక జిల్లాలో పలుచోట్ల గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇప్పటికీ ద్వారక, పోర్‌‌బందర్‌‌, జామ్‌‌నగర్‌‌, మోర్బీ తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 6 మీటర్ల మేర ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఎవరూ తీరం వైపు రావద్దని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలుచేస్తున్నారు.

పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో రెస్క్యూ ఆపరేషన్ల కోసం 18 నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాండ్‌ ఫోర్స్‌, 12 ఎస్‌డీఆర్ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధంచేసింది. నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, కోస్ట్‌ కార్డ్‌ సిబ్బందిని రంగంలోకి దింపింది. వడోదర, అహ్మదాబాద్, ఢిల్లీలో హెలికాప్టర్స్‌ను సిద్ధం చేసింది ఎయిర్‌‌‌‌ఫోర్స్. ఒఖా, పోరుబందర్, బకాసుర ఏరియాల్లో రిలీఫ్, రెస్క్యూ కోసం బృందాలను నేవీ సిద్ధం చేసింది. మరోవైపు తుపాను కారణంగా పశ్చిమ రైల్వే 99 రైళ్లను రద్దుచేసింది.


యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వ్యోమగామి సుల్తాన్‌ అల్ నెయాది బిపర్‌జాయ్ తుపాను చిత్రాలను స్పేస్‌ నుంచి తీశాడు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి తీసిన ఈ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడా చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

First Published:  16 Jun 2023 5:19 AM GMT
Next Story