Telugu Global
National

లీకేజీలపై ఉక్కుపాదం.. - లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

లీకేజీలపై ఉక్కుపాదం.. - లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
X

ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. దీనికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిపై కొరడా ఝుళిపించేందుకు వీలుగా పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు–2024ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది అమలులోకి వస్తే.. పేపరు లీకేజీ, మాల్‌ ప్రాక్టీస్, నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడేవారిపై భారీ శిక్ష పడనుంది. కనిష్టంగా మూడేళ్ల నుంచి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా పడే అవకాశముంది. ఈ కార్యకలాపాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాతో పాటు వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులకు కూడా శిక్షపడనుంది.

రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నేరాలకు చట్టంలో ఎటువంటి శిక్షలూ లేవు. కొత్త బిల్లు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎన్‌టీఏ వంటి పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకూ వర్తిస్తుంది. ఈ సందర్భంగా బిల్లులోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... క్వశ్చన్‌ పేపర్లు, ఆన్సర్‌ షీట్ల లీకేజీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్నా.. అభ్యర్థులకు నేరుగా గాని, ఇతర మార్గాల ద్వారా గాని సహకరించినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా శిక్షార్హులవుతారు.

నియామక సంస్థల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించడం, నకిలీ పరీక్షలను నిర్వహించడం, నకిలీ అడ్మిట్‌ కార్డులను జారీ చేయడం, నకిలీ నియామక పత్రాలను ఇవ్వడం శిక్షార్హమవుతాయి. పరీక్షల సమయంలో తమకు అనుకూలమైనవారికి సీట్లను మార్చడం, పరీక్ష తేదీలను, షిఫ్టులను అనుకూలంగా మార్చడం కూడా శిక్షార్హమవుతాయి.

First Published:  6 Feb 2024 10:52 AM IST
Next Story