Telugu Global
National

తనను రేప్ చేసిన దోషులను విడుదల చేయడాన్ని 'సుప్రీం'లో సవాల్ చేసిన బిల్కిస్ బానో

దోషులను విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది మహారాష్ట్ర ప్రభుత్వమే కానీ గుజరాత్ ప్రభుత్వం కాదని బిల్కిస్ బానో తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎందుకంటే ఈ కేసును ముంబై సీబీఐ కోర్టు విచారణ జరిపి దోషులకు శిక్ష విధించింది.

తనను రేప్ చేసిన దోషులను విడుదల చేయడాన్ని  సుప్రీంలో సవాల్ చేసిన బిల్కిస్ బానో
X

2002 గుజరాత్ అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారం చేసి, తన కుటుంబాన్ని చంపిన 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పాత‌ రిమిషన్ పాలసీ ప్రకారం గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15 స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున దోషులను విడుదల చేసింది. ఈ చర్య దేశవ్యాప్తంగా తీవ్ర‌ ఆగ్రహాన్ని రేకెత్తించింది, ప్రత్యేకించి రేపిస్టులకు ఒక హిందూ సంస్థ పూలమాలలు వేసి, వారిని హీరోలుగా స్వాగతించిన చిత్రాలు చూసి దేశం భగభగ మండిపోయింది.

11 మంది దోషుల్లో ఒకరి పిటిషన్‌పై, 1992 రిమిషన్ పాలసీ ప్రకారం గుజరాత్ ప్రభుత్వం అతనిని విడుదల చేయడాన్ని పరిశీలించ‌వచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆ తీర్పు ఆధారంగా గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మందిని విడుదల చేసింది. కేంద్రం కూడా విడుదలను వేగవంతం చేసింది, రెండు వారాల్లో గుజరాత్ ప్రభుత్వ చర్యను క్లియర్ చేసింది.

అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి దోషుల విడుదలను నిరోధించే గుజరాత్ ప్రభుత్వపు 2014 విధానం అనుసరించి ఉంటే వారు విడుదలయ్యేవారు కాదు.

దోషులను విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది మహారాష్ట్ర ప్రభుత్వమే కానీ గుజరాత్ ప్రభుత్వం కాదని బిల్కిస్ బానో తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎందుకంటే ఈ కేసును ముంబై సీబీఐ కోర్టు విచారణ జరిపి దోషులకు శిక్ష విధించింది.

బిల్కిస్ బానో మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులను చంపిన ఆ 11 మంది ఆమెపై సామూహిక అత్యాచారం చేసినప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు.

First Published:  30 Nov 2022 9:35 AM GMT
Next Story