Telugu Global
National

రేపిస్ట్ ల విడుదలతో ఖాళీ అవుతున్న రంధిక్ పూర్..

తప్పు చేసినవారంతా ఊరిలో దర్జాగా తిరుగుతుంటే, తాము ధైర్యంగా ఉండలేకపోతున్నామని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు అక్కడినుంచి వలస వెళ్లిపోతున్నాయి.

రేపిస్ట్ ల విడుదలతో ఖాళీ అవుతున్న రంధిక్ పూర్..
X

బిల్కిస్ బానోపై అత్యాచారం ఆమె కుటుంబ సభ్యుల హత్య జరిగిన రంధిక్ పూర్ గ్రామం ఇప్పుడు ఖాళీ అవుతోంది. బిల్కిస్ బానో కుటుంబ సభ్యులు, బాధితులు ఇంకా ఆ ఊరిలోనే ఉన్నారు. రేపిస్ట్ ల విడుదల తర్వాత వారంతా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటి వరకూ తమకు ఎలాంటి హెచ్చరికలు రాలేదని, కానీ.. తప్పు చేసినవారంతా ఊరిలో దర్జాగా తిరుగుతుంటే, తాము ధైర్యంగా ఉండలేకపోతున్నామని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు అక్కడినుంచి వలస వెళ్లిపోతున్నాయి. ఆడబిడ్డల రక్షణకు తమకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదంటున్నారు వారు.

స్వాగతం.. భయం..

బిల్కిస్ బానో నిందితులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం, వెంటనే వారు విడుదల కావడం అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు భయాందోళనలకు కారణం అవుతున్నాయి. వారికి వీర తిలకాలు దిద్ది స్వాగతం పలకడం, వారు అమాయకులని చెప్పడం.. ఇవన్నీ చూస్తుంటే తప్పుచేసినవారికి కూడా ఎలాంటి రక్షణ ఉంటుందో, ఎలా వెనకేసుకు రావచ్చో అర్థమవుతోంది. ఆ స్వాగతం వల్లే తమలో భయం మొదలైందని వణికిపోతున్నారు గ్రామస్తులు. వీరంతా దాహోద్‌ జిల్లాలోని రహీమబాద్‌ రిలీఫ్‌ కాలనీకి వలస వెళ్తున్నారు. బిల్కిస్‌ బానో ఉదంతం జరిగాక, 2004లో రంధిక్‌ పూర్‌ గ్రామం నుంచి దాదాపు 74 కుటుంబాలు రిలీఫ్‌ కాలనీకి మారాయి. దోషులకు శిక్ష పడిందని తెలియగానే వారు తిరిగి సొంతూరుకు వచ్చేశారు. ఇప్పుడు వారంతా మళ్లీ భయంతో రిలీఫ్ కాలనీకి వెళ్లిపోతున్నారు.

ధైర్యంగా తిరుగుతున్నారు..

11మంది రేపిస్ట్ లు ఇప్పుడు రంధిక్ పూర్ గ్రామంలో కలియదిరుగుతున్నారు. జైలు శిక్ష అనుభవించామన్న పశ్చాత్తాపం వారిలో ఏమాత్రం కనిపించట్లేదు. అన్ని చోట్లకీ వారు ధైర్యంగా వచ్చేస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలు భయపడిపోతున్నాయి. అయితే సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు వారంతా. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌తో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నారు.

First Published:  24 Aug 2022 5:58 AM GMT
Next Story