బిల్కిస్ బానో కేసు: జైలు నుంచి విడుదలైన 11 మంది దోషులకు సుప్రీం కోర్టు నోటీసులు
11 మందికి దోషులకు నోటీసులు అందజేయాలని, వారి ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ గురించి తెలియజేయడానికి వార్తాపత్రికలలో కూడా ఈ నోటీసులను ప్రచురించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్-కమ్-మర్డర్ కేసులో జైలు నుంచి విడులైన 11 మందికి దోషులకు నోటీసులు అందజేయాలని, వారి ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ గురించి తెలియజేయడానికి వార్తాపత్రికలలో కూడా ఈ నోటీసులను ప్రచురించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం 15 ఆగస్టు 2022న ముందస్తుగా విడుదల చేసింది. విడుదల ఆర్డర్‌ను పక్కన పెట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిఐఎల్‌లు) దాఖలయ్యాయి. అలాంటి ఐదు పిటిషన్లు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి.
మంగళవారం జస్టిస్ కె.ఎం. జోసెఫ్ నేతృత్వంలోని జస్టిస్ బివి నాగరత్న, అహ్సానుద్దీన్ అమానుల్లా తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును జూలై 11 వతేదీకి వాయిదా వేసింది.
కాగా, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన నివేదిక ప్రకారం, స్థానిక పోలీసులు నోటీసు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక దోషి తన నివాసంలో లేడు.
మరో మూడు సంబంధిత పిటిషన్లలో, 11 మంది దోషులలో కొంతమందికి వారి విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల గురించి ఇంకా కోర్టు నోటీసులు అందజేయలేదు.
సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం,11 మంది దోషులకు నోటీసులు అందించకపోతే, కోర్టు విచారణను కొనసాగించలేమని దోషుల తరపు న్యాయవాది వాదించారు.
దోషులకు నోటీసులు అందజేయడానికి చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తూ, కోర్టు నోటీసును ఏకకాలంలో రెండు గుజరాతీ వార్తాపత్రికలలో ప్రచారం చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.