బిల్కిస్ బానో కేసు: విచారణ బెంచ్ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది
బిల్కిస్ బానో, రెండు వేర్వేరు పిటిషన్లలో, ఆగస్టు 15 న గుజరాత్ ప్రభుత్వం దోషులను త్వరగా విడుదల చేయడాన్ని సవాలు చేసింది, సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టం నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాంత్రిక ఉత్తర్వును ఆమోదించిందని ఆమె పిటిషన్లలో పేర్కొంది.
బిల్కిస్ బానో కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేది తప్పుకున్నారు. ఈ రోజు కేసు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ త్రివేది లతో కూడిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. విచారణ చేపట్టి వెంటనే ధర్మాసనం లోని మరో న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి మాట్లాడుతూ తన సహచర న్యాయమూర్తి బేలా త్రివేదికి ఈ కేసు విచారణలో పాల్గొనడం ఇష్టం లేదన్నారు. అందువల్ల మరో ధర్మాసనం ముందు ఈ కేసు విచారణను పోస్ట్ చేయాలని ఆదేశించారు. అయితే జస్టిస్ త్రివేది నిరాసక్తతకు గల కారణాలను ధర్మాసనం తెలపలేదు.
గుజరాత్ లో 2002 డిసెంబర్ 13న బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురి కాగా ఆమె మూడేళ్ళ కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మంది దోషులను రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది ఆగస్టు 15న వారిని విడుదల చేసింది. ఈ విడుదలను బిల్కిస్ బానో సవాలు చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ త్రివేది తప్పుకున్నారు. దాంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది.
బిల్కిస్ బానో, రెండు వేర్వేరు పిటిషన్లలో, ఆగస్టు 15 న గుజరాత్ ప్రభుత్వం దోషులను త్వరగా విడుదల చేయడాన్ని సవాలు చేసింది, సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టం నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాంత్రిక ఉత్తర్వును ఆమోదించిందని ఆమె పిటిషన్లలో పేర్కొంది.
" ఎన్నో అడ్డంకులు అవరోధాలు దాటుకుని మరోసారి న్యాయస్థానం తలుపు తట్టడం నాకు అంత తేలిగ్గా సాధ్య పడలేదు. చాలా కాలంగా, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులు విడుదలైన తర్వాత, నేను నిస్సత్తువగా మారిపోయాను. నేను షాక్ కు గురయ్యాను. నా పిల్లలను, అన్నింటికీ మించి, ఆశ కోల్పోవడం వల్ల షాక్ కు గురయ్యాను, "అని పిటిషన్‌లు దాఖలు చేసే సమయంలో బిల్కిస్ బానో చెప్పారు.