Telugu Global
National

బీహార్ లో నూపుర్ శర్మ వీడియో చూస్తున్న యువకునిపై హత్యాయత్నం

బీహార్ లో నూపుర్ శర్మ వీడియో చూస్తుండగా ఓ యువకుడిపై కొందరు కత్తితో దాడి చేశారు. అయితే ఈ స‍ంఘటనకు నూపుర్ శర్మ వీడియోకు ఏ సంబంధం లేదని పోలీసులు చెప్తున్నారు.

బీహార్ లో నూపుర్ శర్మ వీడియో చూస్తున్న యువకునిపై హత్యాయత్నం
X

నూపుర్ శర్మ అంటించిన చిచ్ఛు ఇప్పటికీ ఆరలేదు. దేశంలో ఎక్కడో ఒక చోట నూపుర్ తాలూకు సెగలు రగులుతూనే ఉన్నాయి. ఉదయ పూర్ లో ఓ టైలర్ దారుణ హత్యకు గురి కాగా తాజాగా .. బీహార్ లోని సీతామర్హి జిల్లాలో జరిగిన ఓ ఘటన షాక్ కి గురి చేస్తోంది. నూపుర్ కి సంబంధించిన సోషల్ మీడియా పోస్టును తన మొబైల్ లో చూస్తున్న 23 ఏళ్ళ యువకుడి మీద కొందరు కత్తితో దాడి చేశారు. అంకిత్ అనే ఈ యువకుడు ఓ పాన్ షాప్ వద్ద ఈ వీడియో చూస్తుండగా కొందరు వ్యక్తులు వారించారు. అయితే అంకిత్ నిరాకరించడంతో వారు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరు కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 15 న ఈ ఘటన జరిగినప్పటికీ సోమవారం వెలుగులోకి వచ్చింది. కేవలం నుపుర్ శర్మకు సంబంధించిన మీడియా పోస్టును చూసినంత మాత్రాన తనపై అమానుషంగా కత్తితో దాడి చేస్తారని తాను ఊహించలేదని అంకిత్ చెప్పాడు. ఇతడిపై దాడి చేసిన ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్టు వారు తెలిపారు. అంకిత్ పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో అంకిత్ కి, ఈ వ్యక్తులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందని, మొదట ఇద్దరు వ్యక్తులు ఇతనిపై దుర్భాషలాడడంతో అంకిత్ వారిని ఎదిరించాడని, కొద్దిసేపటికి ఆ ఇద్దరు వెళ్ళిపోయి మరో ముగ్గురితో వచ్చి అతనిపై దాడికి దిగారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

కాగా తాము మొదట ఇచ్చిన ఫిర్యాదులో నుపుర్ శర్మ పేరును ప్రస్తావించామని, కానీ ఆమె పేరు తొలగించి మరో ఫిర్యాదును సమర్పించాలని పోలీసులు కోరారని అంకిత్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇందుకు కారణాలు తెలియడం లేదన్నారు. నిందితుల పేర్లను కూడా అంకిత్ పోలీసులకు తెలియజేశాడు.అయితే ఈ కేసులో నూపుర్ ప్రస్తావన అనవసరమని, యేవో తెలియని కారణాల వల్ల బాధితుడు, నిందితులు గొడవ పడ్డారని సీతామర్హి జిల్లా.. నాంపూర్ పోలీసు స్టేషన్ ఇన్-ఛార్జ్ విజయ్ కుమార్ రామ్ చెప్పారు. బహుశా వీరి మధ్య పాత కక్షలుండవచ్చునని భావిస్తున్నామన్నారు. ఈ గొడవలో గులాబ్ రబ్బానీ అలియాస్ గోరా అనే వ్యక్తి.. అంకిత్ పై కత్తితో దాడి చేశాడని ఆయన తెలిపారు. ఈ కేసులో తాము నలుగురిపై ఎఫ్ ఐ ఆర్ పెట్టామన్నారు.




First Published:  19 July 2022 12:30 AM GMT
Next Story