వలస కార్మికుల్లో ప్రాణ భయం.. తమిళనాడు వీడొద్దని స్టాలిన్ అభయం
తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న కార్మికులంతా తమ వాళ్లేనని, వారికి ఎటువంటి హాని జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు స్టాలిన్.
ఇటీవల తమిళనాడులో ఉత్తరాది కూలీలపై జరిగిన దాడులు సంచలనంగా మారాయి. మీరు ఎక్కడినుంచి వచ్చారు, ఎందుకొచ్చారంటూ ఉత్తరాది వలస కార్మికులపై కొంతమంది దౌర్జన్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైళ్లలో కూడా వలస కార్మికులను చావగొట్టారన్న పుకార్లు కూడా వ్యాపించాయి. దీంతో తమిళనాడులో నివాసం ఉంటున్న ఉత్తరాది కార్మికులు ప్రాణ భయంతో హడలిపోతున్నారు. పెట్టేబేడా సర్దుకుని సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు వలస కార్మికులతో కిక్కిరిసిపోయాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం చొరవ తీసుకుంది, కార్మికులకు అభయమిచ్చింది.
తమిళనాడులోని వలస కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ కు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న కార్మికులంతా తమ వాళ్లేనని, వారికి ఎటువంటి హాని జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఫేక్ వీడియోతో మొదలైందా..?
బీహార్ కు చెందిన ఒక జర్నలిస్ట్ తమిళనాడులో వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ఒక ఫేక్ వీడియోని ఆన్ లైన్ లో సర్క్యులేట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. పోలీసు దర్యాప్తులో కూడా అది ఫేక్ వీడియో అని తేలింది. అయితే ఆ తర్వాత చాలామంది వలస కార్మికులు భయపడ్డారు. ముఖ్యంగా బీహార్ కి చెందిన కార్మికులు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారు. తమిళనాడులో ఉంటే తమపై దాడులు జరుగుతాయని వారు నమ్మడంతో సొంత ఊళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.
దాడుల భయంతో కార్మికులు తిరిగి వెళ్లిపోవడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వారికి ధైర్యవచనాలు చెబుతోంది. స్వయంగా సీఎం స్టాలిన్ రంగంలోకి దిగారు. అటు తమిళనాడు పోలీస్ యంత్రాంగం కూడా వలస కార్మికులకు ధైర్యం చెబుతోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో వేచి చూస్తున్నవారికి నచ్చజెప్పి తమిళనాడులోనే ఉండేలా చేస్తున్నారు.