Telugu Global
National

నిరుద్యోగిని దారుణంగా కొట్టిన కలెక్టర్ - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

బీహార్ లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న‌ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఓ అభ్యర్థిపై దారుణంగా దాడి చేశారు. రక్తాలు వచ్చేట్టు కొట్టారు. ఈ సంఘటనపై ప్రభుత్వ విచారణకు ఆదేశించింది.

నిరుద్యోగిని దారుణంగా కొట్టిన కలెక్టర్ - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
X

పాట్నాలో షాకింగ్ సంఘటన జరిగింది. టీచింగ్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తిని ఐఏఎస్ అధికారి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అభ్యర్థి జాతీయ జెండా అడ్డుగా పెట్టినా కూడా వదలని అదనపు జిల్లా కలెక్టర్ కెకె సింగ్ ఆ విద్యార్థిని కసి కొద్దీ కొట్టాడు. చెవుల్లో నుంచి రక్తం వస్తున్నా ఆపకుండా కొట్టాడు.

టీచింగ్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పాట్నాలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.ఈ సందర్భంగా పాట్నా అదనపు జిల్లా కలెక్టర్ కెకె సింగ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నిరసన తెలుపుతున్న ఓ అభ్యర్థిపై వ్యక్తిగత కక్ష ఉన్నట్టు ప్రవర్తించారాయన.

దీనీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. అతను దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి పాట్నా సెంట్రల్ SP మరియు DDC నేతృత్వంలో విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.

బీహార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న తన స్వాతంత్య్ర‌ దినోత్సవ వాగ్దానాన్ని పునరుద్ఘాటించిన తేజస్వీ యాదవ్, విద్యార్థులు ఓపిక పట్టాలని అభ్యర్థించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అని ట్వీట్ చేశారు.


ఉద్యోగ ఆశావహులు, అభ్యర్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. "20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడిన నితీశ్ కుమార్, పోలీసులతో పాట్నాలో నిరసన చేస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులను అమానుషంగా కొట్టించారు. బీహార్ ప్రభుత్వం, అధికారులు ఉపాధ్యాయున్ని రక్తం వచ్చేట్టు కొట్టారు. త్రివర్ణ పతాకాన్ని అవమానించారు. ఇది జెడి(యు)-ఆర్‌జెడి ప్రభుత్వ అసలు ముఖం. అని విమర్శించారు.

First Published:  23 Aug 2022 9:22 AM IST
Next Story