Telugu Global
National

పెళ్లికి పోలీసుల అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే..!

ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని జీవో కూడా జారీ చేసింది. ఒక్క 2022 సంవత్సరంలోనే పెళ్లి వేడుకల్లో జరిపిన కాల్పుల్లో మిస్ ఫైర్ జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

పెళ్లికి పోలీసుల అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే..!
X

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అపురూప క్షణమే. అందుకే బంధుమిత్రులందరినీ పిలిచి వేడుకగా జ‌రుపుకుంటారు. అయితే ఈ వేడుకల్లో కొందరు శృతి మించి చేసే పనులతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లితంతు ముగిసిన త‌రువాత న‌వ‌దంప‌తుల‌ను ఊరేగింపుగా తీసుకెళ్తూ టపాసులు కాల్చుతుంటారు. అయితే బీహార్ రాష్ట్రంలో మాత్రం ట‌పాసుల బ‌దులుగా తుపాకులను గాల్లోకి పేల్చుతుంటారు.

అయితే ఈ తుపాకీ కాల్పుల్లో ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరుగుతుంటుంది. ఈ ప్రాణనష్టాన్ని అరిక‌ట్ట‌డానికి బీహార్ ప్ర‌భుత్వం కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చింది. ఇకపై పెళ్లి వేడుకల్లో తుపాకీ తూటాలు గాల్లో పేల్చ‌డాన్ని నిషేధించింది. ఎవరైనా కాల్పులు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇటీవల హెచ్చ‌రించింది.

అంతేకాదు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని జీవో కూడా జారీ చేసింది. ఒక్క 2022 సంవత్సరంలోనే పెళ్లి వేడుకల్లో జరిపిన కాల్పుల్లో మిస్ ఫైర్ జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఏ ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి చేసింది.

పెళ్లి విషయంలో ప్రభుత్వం తెచ్చిన నిబంధనల గురించి శాంతి భద్రతల విభాగం ఏడీజీపీ సంజయ్ సింగ్ వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం..పెళ్లి జరిగే తేదీలు, సమయాలు, ఇతర వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. కళ్యాణ మండపాలు, ధర్మసత్రాల నిర్వాహకులు కూడా తమ వద్ద జరిగే పెళ్లీళ్ల వివరాలు పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. పెళ్లి వేడుకలు జరిగే చోట సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి. ఇళ్ల పెద్ద పెళ్లి జరిగినా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే.

First Published:  1 July 2023 8:40 PM IST
Next Story