సీబీఐ, ఈడీ ఆఫీస్ లు మా ఇంట్లో పెట్టుకోండి..
ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకున్నా తగ్గేది లేదని ముందుగానే ప్రకటిస్తున్నారు బీహార్ నేతలు. తేజస్వి యాదవ్ ఓ అడుగు మందుకేసి ఈడీ, సీబీఐ ఆఫీస్ లను తమ ఇంట్లోనే పెట్టుకోండని సవాల్ విసిరారు.
ఈడీ అధికారులు తమ నెక్ట్స్ టార్గెట్ బీహార్ అంటూ చర్చించుకుంటున్నట్టుగా పొలిటికల్ కార్టూన్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ ఎంత హుషారుగా ఉంటాయో ఇటీవల మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ సంఘటనల ద్వారా మరోసారి రుజువైంది. తాజాగా బీహార్ లో కూడా ప్రభుత్వం మారడంతో ఈడీకి చేతినిండా పని దొరుకుతుందనే అంచనాలున్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో ఈడీ, సీబీఐకి స్వాగతమంటూ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. రాజకీయ ప్రతీకార దాడులకు తగ్గేది లేదంటున్న ఆయన.. ఈడీ, సీబీఐ తమ ఇంట్లో ఆఫీస్ లు పెట్టుకున్నా ఇబ్బంది లేదని చెప్పారు.
పిల్లవాడిగా ఉన్నప్పుడే కేసులు..
హవాలా లావాదేవీల వ్యవహారంలో గతంలో తేజస్వి యాదవ్ పై కేసులు పెట్టారు. అప్పట్లో బీహార్ లో ఆర్జేడీ అధికారంలో లేదు. తనపై రాజకీయ ప్రతీకారం కోసమే కేసులు పెట్టారని, పిల్లవాడిగా ఉన్నప్పుడే తాను కేసులు ఎదుర్కొన్నానని చెప్పారు తేజస్వి యాదవ్. 2017లో విపక్ష నేతగా పని చేస్తున్నప్పటి నుంచి తాను పరిణతి పొందానని అన్నారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించానని చెప్పారు.
శాంతి జరుగుతుందా..?
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఎన్డీఏకి షాకిచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకున్న తర్వాత కచ్చితంగా వారిపై ప్రతీకార చర్యలుంటాయని అంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకున్నా తగ్గేది లేదని ముందుగానే ప్రకటిస్తున్నారు బీహార్ నేతలు. తేజస్వి యాదవ్ ఓ అడుగు మందుకేసి ఈడీ, సీబీఐ ఆఫీస్ లను తమ ఇంట్లోనే పెట్టుకోండని సవాల్ విసిరారు. అలా అయినా బీజేపీకి శాంతి చేకూరుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.