Telugu Global
National

తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం.. కాన్వాయ్ అడ్డగింత

తమ ప్రాంతంలో రోడ్లు వేయకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని తేజస్వి కాన్వాయ్ కి అడ్డుగా రోడ్డుపై పడుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తేజస్వి యాదవ్ అక్కడి నుంచి వెనుదిరిగారు.

తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం.. కాన్వాయ్ అడ్డగింత
X

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వచ్చిన ఆయన కాన్వాయ్‌ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా వందలాది మంది చుట్టుముట్టడంతో ఉక్కిరి బిక్కిరి అయిన తేజస్వి ఎలాగోలా అక్కడ్నుంచి బయటపడ్డారు. రూ.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు సొంత నియోజకవర్గంలోని రాఘోపూర్ కు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వచ్చారు. ఆయన అక్కడికి చేరుకోగానే మాలిక్ పూర్ కు చెందిన మహా దళిత్ వర్గప్రజలు తేజస్వి కాన్వాయ్ ని చుట్టుముట్టారు.

తమ ప్రాంతంలో పక్కా రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరగకుండా దబాంగ్ వర్గానికి చెందిన కులస్థులు అడ్డుకుంటున్నారని చెప్పారు. సమస్య పరిష్కరించాలని నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడంలేదన్నారు. తమ ప్రాంతంలో రోడ్లు వేయకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని తేజస్వి కాన్వాయ్ కి అడ్డుగా రోడ్డుపై పడుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తేజస్వి యాదవ్ అక్కడి నుంచి వెనుదిరిగారు.

అయితే ఆయన కాన్వాయ్ అక్కడ నుంచి కొంత దూరం వెళ్లిన తర్వాత కొంతమంది విద్యార్థులు మళ్ళీ ఆయన కాన్వాయ్ కి అడ్డు తగిలారు. డిగ్రీ కళాశాల, స్టేడియం సమస్యలపై తేజస్వి యాదవ్ తో మాట్లాడాలన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను చెద‌ర‌గొట్టంతో తేజస్వి యాదవ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలోనే రెండు ప్రాంతాల్లో తేజస్వి యాదవ్ ను ప్రజలు అడ్డుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  25 Jan 2023 6:42 PM IST
Next Story