Telugu Global
National

మోదీకి మూడినట్టే.. యూపీ నుంచి లోక్ సభ బరిలో నితీష్..?

బీహార్ సీఎంగా ఉంటూనే 2024 లోక్ సభ ఎన్నికల్లో నితీష్ యూపీ నుంచి బరిలో దిగేందుకు ఆలోచిస్తున్నారు. యూపీలోని ఫూల్ పుర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

మోదీకి మూడినట్టే.. యూపీ నుంచి లోక్ సభ బరిలో నితీష్..?
X

ప్రస్తుతం నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ఉన్నారు. అక్కడ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే సార్వత్రిక ఎన్నికలొస్తాయి. ఆ టైమ్ లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలను ఏకం చేయడానికి నితీష్ కి మంచి అవకాశముంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ‌డానికి ఆయన కూడా వ్యూహ రచనలో ఉన్నారు. బీహార్ సీఎంగా ఉంటూనే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆయన యూపీ నుంచి బరిలో దిగేందుకు ఆలోచిస్తున్నారు. యూపీలోని ఫూల్ పుర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

ప్రధాని నరేంద్రమోదీ సిట్టింగ్ స్థానం వారణాసికి ఫూల్ పుర్ 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ పోటీ చేసి గెలవాలని, యూపీలో ప్రతిపక్షాల సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారట నితీష్. 80 లోక్ సభ స్థానాలున్న యూపీలో ఎవరికి మెజార్టీ వస్తే, దేశంలో వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే న‌మ్మ‌కం ఒక‌టి ఉంది. అందుకే నితీష్ ఇప్పుడు యూపీపై ఫోకస్ పెంచారు. ఆయన యూపీ వస్తే సమాజ్ వాదీ పార్టీ కూడా ఆయనకే మద్దతిస్తుందని ప్రకటించారు ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. యూపీలో ఎలాగైనా యోగిని నిలువరించాలని చూస్తున్న అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికలకోసం ఆర్జేడీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.

ముప్పేట దాడి..

సార్వత్రిక ఎన్నికలనాటికి బీజేపీపై ముప్పేట దాడి జరిగేట్టు స్పష్టమవుతోంది. ఓవైపు నుంచి కేసీఆర్ జాతీయ పార్టీతో ముందుకొస్తున్నారు, అటు కేజ్రీవాల్ ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు. బీజేపీ వ్యూహాలను చిత్తుచేసి బీహార్ లో మిత్రపక్షాలను ఏకం చేసి నితీష్ కుమార్ అతిపెద్ద వ్యూహకర్తగా మారారు. ఈ ముప్పేట దాడిని కాచుకోవడం మోదీవల్ల కాదేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. మమతా బెనర్జీ ప్రస్తుతానికి అంటీముట్టనట్టు ఉన్నా ప్రతిపక్షాల బలం పెరిగితే కచ్చితంగా ఆమె మోదీకి వ్యతిరేకంగా నిలబడటం ఖాయం. ఈ దశలో 2024 లోక్ సభ ఎన్నికలు బీజేపీకి అంత సులభం కాదనేది విశ్లేషకుల మాట.

టార్గెట్ యూపీ..

అత్యథిక లోక్ సభ స్థానాలున్న రాష్ట్రంగానే కాకుండా, స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసే రాష్ట్రంగా కూడా యూపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే యూపీని నితీష్ కుమార్ టార్గెట్ చేయాలనుకుంటున్నారు. 2024 లోకసభ ఎన్నికల్లో యూపీ నుంచి ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. ఫూల్‌ పుర్‌తో పాటు అంబేద్కర్ నగర్, మీర్జాపూర్‌ లోక్‌సభ స్థానాల నుంచి కూడా ఆయనకు ఆఫర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

First Published:  18 Sep 2022 5:35 AM GMT
Next Story