అవినీతిపరులు సరే గోడదూకేవారి సంగతేంటి మోదీజీ..!
బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మోదీని నేరుగా టార్గెట్ చేశారు. అవినీతిపరులను కాపాడాలని ఎవరూ అనుకోరని, అదే సమయంలో గోడమీది పిల్లులను మోదీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు.
అవినీతి పరుల భరతం పట్టేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తుంటే కొంతమంది వారికి రక్షణగా నిలుస్తున్నారని, సరికొత్త కూటములు పుట్టుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్రమోదీ. కేరళ పర్యటనలో ఉన్న ఆయన, ప్రతిపక్షాలన్నీ కలిసి అవినీతి పరులను కాపాడుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రజలు, దేశ ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోదీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మోదీని నేరుగా టార్గెట్ చేశారు. అవినీతిపరులను కాపాడాలని ఎవరూ అనుకోరని, అదే సమయంలో గోడమీది పిల్లులను మోదీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలనుకోవడం, పార్టీల్లో చిచ్చుపెట్టి చీల్చాలనుకోవడం అవినీతికంటే మరింత దారుణమైనదని అన్నారు నితీష్ కుమార్.
వాజ్ పేయితో కలసి తాను పనిచేశానని, ఆయన అందరినీ జాగ్రత్తగా చూసుకునేవారని, ఫిరాయింపులను ప్రోత్సహించడం, పార్టీలను చీల్చడం, అక్రమంగా రాష్ట్రాల్లో పాగా వేయాలనుకోవడం ఆయన అభిమతం కాదన్నారు నితీష్ కుమార్. కానీ మోదీ అక్రమ మార్గాల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అవినీతికంటే అది మరింత ప్రమాదకరమైన జాడ్యం అని అన్నారు.
అవినీతిపరులను కాపాడాలని ఎవరు అనుకుంటారు.. అవినీతి గురించి మాట్లాడేవారు, పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తారని అన్నారు నితీష్ కుమార్. వారేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పొచ్చు కానీ, దానిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదంటూ ముక్తాయించారు. అవినీతిపరులు, చర్యలు అంటూ మోదీ చేస్తున్న ప్రసంగాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్.