బీజేపీని దేశంలో ఎక్కడా లేకుండా చేయాలి.. - బీహార్ సీఎం నితీశ్‌కుమార్
2024 ఎన్నికల్లో బీజేపీని 100 సీట్ల లోపు కట్టడి చేయవచ్చని నితీశ్ చెప్పారు. ప్రతిపక్షాలతో జట్టు కట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ త్వరగా ఒక నిర్ణయానికి రావాలని నితీశ్ సూచించారు.
బీజేపీని దేశంలో ఎక్కడా లేకుండా చేయాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. బీహార్‌లోని పూర్ణియాలో శనివారం జరిగిన మహాఘఠ్ బంధన్ ర్యాలీలో నితీశ్ ప్రసంగించారు. ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని అధికార పీఠం నుంచి దించేయడమే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడాలని ఆయన తెలిపారు. అలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీని 100 సీట్ల లోపు కట్టడి చేయవచ్చని నితీశ్ చెప్పారు. ప్రతిపక్షాలతో జట్టు కట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ త్వరగా ఒక నిర్ణయానికి రావాలని నితీశ్ సూచించారు.
ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా మాట్లాడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. కుల, మత ప్రాతిపదికన దేశ ప్రజలను విభజించే కుట్రకు బీజేపీ తెరతీసిందని విమర్శించారు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఢిల్లీకి చేరుకున్న ఆయన అక్కడినుంచే ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. మైనారిటీలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు గిట్టదని తెలిపారు. బీజేపీని ఓడించే సంకల్పానికి బీహార్ నుంచే శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు.