నేను ప్రధాని అభ్యర్థిని కాను.. విపక్షాల ఐక్యతే నాకు ముఖ్యం..
ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ అయిన నితీష్.. 2024 ఎన్నికల్లో విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెస్తామంటున్నారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, సాధారణ ఎన్నికల నాటికి ఈ కుట్రలన్నిటినీ ఛేదించి గట్టిగా నిలబడతామని చెప్పారు
విపక్షాలన్నీ వేటికవే మోదీ సర్కారుని కూల్చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే, కానీ వారిలో ఐకమత్యం లేదనేది బీజేపీకి ఉన్న బలమైన నమ్మకం. ప్రధాని అభ్యర్థి అనే విషయంలోనే విపక్షాలన్నీ కకావికలం అయిపోతాయని, మోదీ ముందు చెల్లాచెదరైపోతాయని బీజేపీ ఆశపడుతోంది. కానీ ఈసారి టార్గెట్ మోదీ - దేనికోసమైనా రెడీ అంటున్నారు విపక్ష నేతలు. తనకు ప్రధానమంత్రి కావాలన్న ఆశ లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందుగా క్లారిటీ ఇచ్చారు. విపక్ష కూటమి విషయంలో మరో అడుగు ముందుకేశారు.
ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ అయిన నితీష్.. 2024 ఎన్నికల్లో విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెస్తామంటున్నారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, సాధారణ ఎన్నికల నాటికి ఈ కుట్రలన్నిటినీ ఛేదించి గట్టిగా నిలబడతామని చెప్పారు. తన ముందున్న ఏకైక కర్తవ్యం అదేనన్న నితీష్, విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిని తాను కాదన్నారు. ఇటీవల బీహార్ లో ఎన్డీఏ కూటమితో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో కలసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్. అప్పటినుంచి ఆయన ప్రధాని రేసులో ఉన్నారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. మోదీ వ్యూహాలను ముందుగానే పసిగట్టి, సమర్థంగా ఎదుర్కొన్న నాయకుడిగా నితీష్ రాజకీయ చతురతను చాలామంది ప్రశంసించారు. భావి ప్రధాని అంటూ కీర్తించారు. కానీ ఇప్పుడే ప్రధాని అభ్యర్థి పేరుని ప్రకటిస్తే, విపక్షాల్లో ఐక్యత కుదరకపోవచ్చు. అందుకే నితీష్ వెనక్కి తగ్గారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తాను ప్రధాని పదవి రేసులో లేనన్నారు.
మహా ఘట్ బంధన్..
జాతీయ పార్టీ ఏర్పాటుకి సిద్ధమైన తెలంగాణ సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల నేతలతో వరుస భేటీలతో బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవల బీహార్ వెళ్లి సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ని కలసి వచ్చారు కేసీఆర్. కేసీఆర్ మంత్రాంగం తర్వాత నితీష్ కుమార్ ఢిల్లీ పయనమయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ అయిన నితీష్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్ తో కూడా భేటీ కావాల్సి ఉంది. మహారాష్ట్ర, హర్యానా, కర్నాటకలో కూడా నితీష్ పర్యటించబోతున్నారని సమాచారం. కేసీఆర్-నితీష్ భేటీ అనంతరం.. ఈ వరుస భేటీలు జరుగుతుండటం గమనార్హం. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్-నితీష్ ద్వయం కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.