Telugu Global
National

కాంగ్రెస్ కి బిగ్ షాక్.. పార్టీకి అనిల్ ఆంటోనీ రాజీనామా

అనిల్ ఆంటోనీ కేరళ కాంగ్రెస్ లో ముఖ్య నేత. పార్టీలో పలు కీలక పదవులు నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలందించిన ఏకే ఆంటోనీ తనయుడు అనిల్.

కాంగ్రెస్ కి బిగ్ షాక్.. పార్టీకి అనిల్ ఆంటోనీ రాజీనామా
X

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ ప్రకటించారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ అనిల్ ఆంటోనీ రాజీనామాకు కారణమైంది. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేరళ రాష్ట్రంలో ప్రదర్శిస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, పార్టీ నిర్ణయాన్ని అనిల్ ఆంటోనీ వ్యతిరేకిస్తూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ ఆంటోనికి తీవ్ర ఒత్తిడి ఎదురైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు అనిల్ ఆంటోనీ బుధవారం ప్రకటించారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. 'నేను వాక్ స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను. అటువంటిది నాపై వాక్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.' అని అనిల్ ఆంటోనీ ట్వీట్ చేశారు.


అనిల్ ఆంటోనీ కేరళ కాంగ్రెస్ లో ముఖ్య నేత. పార్టీలో పలు కీలక పదవులు నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలందించిన ఏకే ఆంటోనీ తనయుడు అనిల్. ఏకే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు అన్న పేరు ఉంది. సోనియా గాంధీ అత్యంత నమ్మే వ్యక్తుల్లో ఏకే ఆంటోనీ ఒకరు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకే ఆంటోనీని నియమించాలని ఒక దశలో పార్టీ కూడా భావించింది. అలాంటి ఏకే ఆంటోనీ కుమారుడు కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇది కేరళ కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  25 Jan 2023 12:42 PM IST
Next Story