Telugu Global
National

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీజేపీ గూటికి కమల్‌నాథ్‌..!

ఇప్పటికే ఇండియా కూటమి నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతుండగా.. ఇక దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఒక్కొక్కరు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు.

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీజేపీ గూటికి కమల్‌నాథ్‌..!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ లీడర్ కమల్‌నాథ్‌ కమలం గూటికి చేరుతారని ప్రచారం జోరందుకుంది. కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ తన సోషల్‌మీడియా బయో నుంచి కాంగ్రెస్‌ను తొలగించడం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. మరోవైపు కమల్‌నాథ్‌ సైతం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఆయన బీజేపీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అది కూడా కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్‌ ఛింద్వాడాలో గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమల్‌నాథ్‌ ఫ్యామిలీ కాంగ్రెస్‌ను వీడితే మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలున్నాయి. కమల్‌నాథ్‌ కుటుంబానికి ఛింద్వాడ కంచుకోట. ఇక్కడ నుంచి వరుసగా 9 సార్లు కమల్‌నాథ్ కుటుంబసభ్యులే గెలిచారు.

ఇప్పటికే ఇండియా కూటమి నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతుండగా.. ఇక దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఒక్కొక్కరు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సైతం హస్తం పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీలో చేరిన రెండో రోజే ఆయనను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ.

First Published:  17 Feb 2024 10:42 AM GMT
Next Story