మరో సారి విషాదంలో భోపాల్ గ్యాస్ బాధితులు: అధిక పరిహారం అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు
1989 లో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి సెటిల్ మెంట్ చేసింది. బాధితులకు నష్టపరిహారంగా కంపెనీ 715 కోట్ల రూపాయలు ఇచ్చింది. ప్రభుత్వం అందులో సగం రిజర్వు బ్యాంకు దగ్గర ఉంచి బాధితులకు వడ్డీ ఇచ్చింది. బాధితులొక్కొక్కరికి 25 వేల నగదు ఇచ్చారు. మరో 25 వేలు రిజర్వ్ బ్యాంకులో ఉన్నది.
1984 , డిశంబర్ 3 వ తేదీ అర్ద రాత్రి భూపాల్ నగరమంతా విషవాయువు కమ్మేసింది. యూనియన్ కార్బైడ్ కంపనీ నుంచి లీకైన కెమికల్ వాయువులు ఇప్పటికీ అక్కడి ప్రజలపై ప్రభావం చూయిస్తున్నాయి. దాదాపు 20 వేల మంది చనిపోయినట్టు స్థానికులు చెప్తుండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు వేల మంది చనిపోయారు. ఈ గ్యాస్ వల్ల 1 లక్ష మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఆ కంపనీ యజమానులను ప్రభుత్వమే క్షేమంగా దేశం దాటించేసిందనే ఆరోపణలున్నాయి.
1989 లో ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి సెటిల్ మెంట్ చేసింది. బాధితులకు నష్టపరిహారంగా కంపెనీ 715 కోట్ల రూపాయలు ఇచ్చింది. ప్రభుత్వం అందులో సగం రిజర్వు బ్యాంకు దగ్గర ఉంచి బాధితులకు వడ్డీ ఇచ్చింది. బాధితులొక్కొక్కరికి 25 వేల నగదు ఇచ్చారు. మరో 25 వేలు రిజర్వ్ బ్యాంకులో ఉన్నది. ఈ నష్టపరిహారం సరిపోదని భోపాల్ గ్యాస్ బాధితులు అనేక పోరాటాలు చేయగా చివరకు కేంద్ర ప్రభుత్వం కోర్టులో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ వారసుల సంస్థల నుండి 7,844 కోట్ల రూపాయల అదనపు నష్టపరిహారాన్ని కోరుతూ 2010లో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఆ పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసును మళ్లీ తెరవడం వల్ల కేసు బాధిత కుటుంబాలకు వ్యతిరేకమవుతుందని కోర్టు పేర్కొంది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వర్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జనవరి 12, 2023న తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా, జరిగిన నష్టాన్ని సరిగ్గా నిర్ధారించలేమని కేంద్రం నొక్కి చెప్పింది.
అయితే, సెటిల్‌మెంట్ సమయంలో పరిహారం సరిపోదని భారత ప్రభుత్వం ఎప్పుడూ సూచించలేదని యూనియన్ కార్బైడ్ కంపనీ (UCC ) వారసుల సంస్థలు తెలిపాయి.
UCC వారసుల సంస్థల తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు.
"1995 నుండి ప్రారంభమై 2011 వరకు సాగిన కేసు విచారణలో, 1989 నాటి సెటిల్‌మెంట్ సరిపోదని ప్రభుత్వం ఒక్క సారి కూడా చెప్పలేదు." అని సాల్వే వాదించారు.
తమను అందరూ మోసం చేశారని భోపాల్ గ్యాస్ బ్బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
68 ఏళ్ల షెహజాది బి మాట్లాడుతూ, మేము అందరిచేత మోసపోయాము. 25 వేలు పరిహారంగా, మరో 25 వేలు రిజర్వ్ బ్యాంక్‌లో జమ చేసి , దానిపై వడ్డీ మాకు అందించారు. కానీ ప్రభుత్వం ఆ వడ్డీని కూడా పరిహారంగా లెక్కిస్తుంది. మిగిలినవన్నీ గాలిలోకి మాయమయ్యాయి. నా జీవితం ఖరీదు ఏమిటో చెప్పండి? 50 వేల రూపాయలా?'' అని ఆమె ప్రశ్నించారు.
గ్యాస్ దుర్ఘటన బాధితురాలైన హరి బాయి మాట్లాడుతూ, బాధితులకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఏదైనా చేస్తుందని తాము భావించామని అన్నారు.
ప్రభుత్వాలు విఫలమైనందున సుప్రీం కోర్టు మాకు అనుకూలంగా ఏదైనా చేస్తుందని మేము ఆశించాము, మాకు సరైన వైద్యం కూడా అందుబాటులో లేదు. మా ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఆసుపత్రుల్లో వైద్యులు లేరు, యంత్రాలు లేవు, మొత్తం వ్యవస్థ దయనీయ స్థితిలో ఉంది. ఇక మేము ఎవరిని ఆశ్రయించాలి?అని హరి బాయి బోరుమంది.