Telugu Global
National

అన్నాభావు సాఠేకు భారత రత్న ఇవ్వాలి.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ డిమాండ్

అన్నాభావు సాఠేకు భారత రత్న ఇవ్వాలని.. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు.

అన్నాభావు సాఠేకు భారత రత్న ఇవ్వాలి.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ డిమాండ్
X

మహారాష్ట్ర యుగ కవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్నాభావు సాఠే భరతమాత ముద్దు బిడ్డ అని.. ఆయన గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని వాటాగేవ్‌లో నిర్వహించిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సాఠే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

అన్నాభావు సాఠేకు భారత రత్న ఇవ్వాలని.. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు. అణగారిన వర్గాల కోసం అన్నాభావు గొంతెత్తారు. ఆయన సమస్యలను చూసి ఎప్పుడూ పారిపోలేదు. ఏదైనా చేయాలని అనుకుంటే వెనక్కి తగ్గలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా వంచిత, పీడిత ప్రజల తరపున అన్నాభావు నిలిచారు. సాఠే గొప్పదనాన్ని రష్యా దేశం కూడా గుర్తించిందని సీఎం కేసీఆర్ అన్నారు.

అన్నాభావు సేవలను ఇప్పటికైనా మన దేశం గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రష్యా గుర్తించినా.. మన దేశం మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ప్రభుత్వం స్వయంగా అన్నాభావును అక్కడకు పిలిపించుకొని.. గొప్పగా సత్కరించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. అన్నాభావుకు లోక్‌షాహెర్ బిరుదును ఇచ్చి సత్కరించారని.. ఆ దేశంలోని గ్రంథాలయ్యాల్లో అన్నాభావు విగ్రహాలను ప్రతిష్టించారని కేసీఆర్ చెప్పారు.

రష్యా కమ్యూనిస్టు నేత మ్యాక్సిమ్ గోర్కి నవల 'మా' ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ నవలను వివిధ భాషల్లోకి అనువదించి.. ప్రపంచమంతా చదివేలా చేశారు. అలాంటి మహానుభావుడితో అన్నాభావును పోల్చారు. రష్యా అయితే అన్నాభావును భారత మ్యాక్సిమ్ గోర్కిగా అభివర్ణించిందని చెప్పారు. అన్నాభావు ఎన్నో గొప్ప రచనలు చేశారు. కానీ అవన్నీ మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. అన్నాభావు రచనలు ఇతర భాషల్లోకి అనువదించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

అన్నాభావు సాఠే రచనలు ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు. ఆయన రచనలు సార్వజనీయం. అన్నాభావు రచనలు ఇతర భాషల్లోకి అనువదించి అందరి చేత చదివింప చేస్తే.. ప్రపంచానికి విజ్ఞానం లభిస్తుందని కేసీఆర్ అన్నారు. మాతంగ్ సామాజిక వర్గానికి మహారాష్ట్ర రాజకీయాల్లో సముచిత స్థానం దక్కడం లేదు. బీఆర్ఎస్ తరపున మేము మాతంగ్ వర్గానికి మంచి స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.


First Published:  1 Aug 2023 5:46 PM IST
Next Story