పీవీ నరసింహారావుకు భారతరత్న.. మరో ఇద్దరికి కూడా..
పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004). వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఒక న్యాయవాది, బహుభాషావేత్త, రచయిత కూడా.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. పీవీతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, భారతదేశపు హరిత పితామహుడు స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రకటించారు. మొన్ననే కర్పూరీ ఠాకుర్, ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రకంగా ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతదేశపు అత్యున్నత పురస్కారం లభించింది. ఇలా ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి.
మోడీ ఏమన్నారంటే..
"మన మాజీ ప్రధాని, పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృత సేవలందించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయనది కీలక పాత్ర. దేశానికి పీవీ చేసిన సాటిలేని సేవలకు ఈ గౌరవం అంకితం" అని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పీవీకి భారతరత్న ప్రకటించడంపై ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పీవీ ప్రస్థానం
పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004). వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఒక న్యాయవాది, బహుభాషావేత్త, రచయిత కూడా. భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా సేవలందించారు. ఆర్థిక సంస్కరణలకు నిజమైన పితామహుడు పీవీ. 1991లో పీవీ ముఖ్యమైన ఆర్థిక పరివర్తనను ప్రారంభించడానికి మన్మోహన్ సింగ్‌ను తన ఆర్థిక మంత్రిగా నియమించారు. పీవీ ఆదేశంతో మన్మోహన్ సింగ్ దాదాపుగా దివాలా తీసిన దేశాన్ని ఆర్థిక పతనం నుంచి రక్షించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విధానాలను అమలు చేసిన సంస్కరణలు దేశ స్థితిని మార్చేశాయి.