Telugu Global
National

కాశ్మీర్ లో భద్రతా వైఫల్యం.. జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్

ఈరోజు మొత్తం రాహుల్ 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా.. కిలోమీటర్ వచ్చే లోపే భద్రతా లోపాలు కనపడటంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. దాదాపు అరగంట సేపు ఆయన జన సమూహం నుంచి అటు ఇటు కదలలేకపోయారని తెలుస్తోంది.

కాశ్మీర్ లో భద్రతా వైఫల్యం.. జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్
X

కాశ్మీర్ లో భారత్ జోడో యాత్ర తాత్కాలికంగా ఆపేశారు. యాత్ర మార్గంలో భద్రతా లోపాలు కనపడ్డాయి. జనాలను నియంత్రించడంలో స్థానిక పోలీసులు వైఫల్యం చెందారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. రాహుల్‌ గాంధీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను ఈరోజు ఆపేశానని చెప్పారు. కాశ్మీర్‌ లోయకు ప్రవేశ ద్వారం అయిన ఖాజీగుండ్ సమీపంలో యాత్రను ఈ రోజుకు తాత్కాలికంగా నిలిపేశారు.


బనిహాల్‌ టన్నెల్‌ దాటి ఖాజీగుండ్‌ ప్రాంతానికి రాహుల్ గాంధీ ఈరోజు చేరుకున్నారు. జోడో యాత్ర షెడ్యూల్‌ ప్రకారం దక్షిణ కాశ్మీర్‌ లోని వెస్సు వైపు పాదయాత్ర ప్రారంభించారు. కానీ అంతలోనే బాహ్య భద్రతా వలయాన్ని పర్యవేక్షించాల్సిన పోలీసులు అక్కడ కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా జనం రాహుల్ వైపు వచ్చేశారు. వారిని నియంత్రించడం రాహుల్ సెక్యూరిటీ సిబ్బందికి వీలుపడలేదు. దీంతోపాటు సెక్యూరిటీ నిర్వహణలో కూడా కొన్ని లోపాలున్నట్టు రాహుల్ సిబ్బంది గుర్తించారు. వారి సూచన మేరకు రాహుల్ యాత్ర ఆపేశారు. ఖానాబాల్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వేదిక దగ్గరకు రాహుల్ వెళ్లారు. ఈరోజు మొత్తం రాహుల్ 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా.. కిలోమీటర్ వచ్చే లోపే భద్రతా లోపాలు కనపడటంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. దాదాపు అరగంట సేపు ఆయన జన సమూహం నుంచి అటు ఇటు కదలలేకపోయారని తెలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్‌ అబ్దుల్లా కూడా రాహుల్ యాత్రలో భాగస్వామి కావడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత హుషారుగా కనిపించాయి.

భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్‌ జమ్మూ-కాశ్మీర్‌ ఇన్‌ ఛార్జి రజనీ పాటిల్ ట్వీట్ చేశారు. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు సమాధానం చెప్పాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్‌ చేశారు. యాత్ర సజావుగా ముందుకు సాగేందుకు రాహుల్ భద్రతా సిబ్బంది, స్థానిక యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పారు.

First Published:  27 Jan 2023 4:35 PM IST
Next Story