Telugu Global
National

భారత్ జోడో యాత్ర : 150 రోజులపాటు కంటైనర్ క్యాబిన్‌లో నిద్రించనున్న రాహుల్ గాంధీ

కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో యాత్ర ఈ నెల 7న ప్రారంభం కానుంది. 150 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో రాహుల్ కంటైనర్ క్యాబిన్లోనే నిద్రిస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.

భారత్ జోడో యాత్ర : 150 రోజులపాటు కంటైనర్ క్యాబిన్‌లో నిద్రించనున్న రాహుల్ గాంధీ
X

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈ నెల‌ 7 వ తేదీ నుంచి క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర చేప‌ట్ట‌నున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి పార్టీ వ‌ర్గాలు స‌న్నాహాలు చేస్తున్నాయి. దాదాపు 150 రోజుల పాటు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాద‌యాత్ర చేస్తూ రాత్రిళ్ళు షిప్పింగ్ కంటైనర్ క్యాబిన్‌లో పడుకుంటారని కాంగ్రెస్ తెలిపింది. సెప్టెంబరు 5 నాటికి కంటైనర్ క్యాబిన్లు కన్యాకుమారి చేరుకునే అవకాశం ఉంది. 3500 కిలోమీటర్ల ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారీ ర్యాలీతో ప్రారంభం కానుంది

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఓటమి పాలైనప్పటి నుంచి తిరోగమన దిశ‌లోన‌డుస్తున్న పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నేరుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళివారితో మాట్లాడేందుకు ఈ పాద‌యాత్ర‌ చేప‌ట్ట‌నుంది.

ఈ యాత్ర‌లో ఎటువంటి రాజ‌కీయ కోణాలు లేవ‌ని, ప్ర‌జ‌ల‌కు ఐక్య‌త‌, శాంతి సందేశాలు వినిపించేందుకేన‌ని కాంగ్రెస్‌ నాయ‌కులు చెబుతున్నారు. ఈ యాత్ర సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల మ‌నోభిప్రాయాల‌ను, స‌మ‌స్య‌ల‌ను వింటార‌ని, ఆయ‌న ప్ర‌సంగాల‌కు త‌క్కువ ప్రాధాన్యం ఇస్తార‌ని చెప్పారు.

"నాలుగు నెలల క్రితమే ఈ స‌న్నాహాలు ప్రారంభమ‌య్యాయి. అధికార ప‌క్షం దేశంలో విద్వేషాలు రెచ్చ‌గొట్టి, ప్ర‌జ‌ల మ‌ద్య‌లో చీలిక‌లు తెస్తూ అన్ని విధాలా ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తోంది. ప్ర‌జా స్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేస్తోంది. భార‌త దేశంలో తిరిగి భిన్న‌త్వంలో ఏక‌త్వ భావ‌న‌తో విల‌సిల్లేలా పూర్వ వైభ‌వం తెచ్చేందుకు జ‌రుగుతున్న శాంతి యాత్ర " అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహ్మద్ తెలిపారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్ మాట్లాడుతూ, పాదయాత్ర సెప్టెంబర్ 8 ఉదయం ప్రారంభమవుతుంది. పాల్గొనేవారు ప్రతిరోజూ 6 నుండి 7 గంటల పాటు నడుస్తారు. "దేశవ్యాప్తంగా ప్రజలతో మ‌మేక‌మ‌వుతూ వారి అభిప్రాయాలు వింటూ పాద‌యాత్ర కొన‌సాగుతుంది" అని ఆయన చెప్పారు. యాత్రకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న డిఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ భారత్‌ జోడో యాత్ర ప్రారంభోత్సవానికి హాజరుకానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓ వైపు కాంగ్రెస్ సంస్థాగ‌త ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో రాహుల్ గాంధీ పాద యాత్ర చేపట్ట‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా, సీనియర్ నేతలు శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరంల డిమాండ్ మేరకు ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పోటీదారులందరికీ ఓట‌ర్ల జాబితా ఇస్తారు కానీ దానిని వెబ్‌సైట్‌లో పోస్టు చేయ‌డం కుద‌ర‌ద‌ని పార్టీ స్ప‌ష్టం చేసింది.

First Published:  1 Sept 2022 7:47 PM IST
Next Story