Telugu Global
National

భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట.. కాంగ్రెస్ సీనియర్ నేత‌కు గాయాలు

మధ్యప్రదేశ్, ఇండోర్ లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో ప్రజలు ఒక‌రినొక‌రు తోసుకుంటూ ముందుకు వెళ్ళ‌డంతో అక్క‌డ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు పలువురు గాయపడ్డారు.

భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట.. కాంగ్రెస్ సీనియర్ నేత‌కు గాయాలు
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో చిన్న అప‌శృతి చోటు చేసుకుంది. జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొనసాగుతోంది. రాహుల్ గాంధీని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఒక‌రినొక‌రు తోసుకుంటూ ముందుకు వెళ్ళ‌డంతో అక్క‌డ తొక్కిసలాట జరిగింది. భారీగా వచ్చిన జనాలను పోలీసులు నియంత్రించలేకపోయారు. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన చేయి, మోకాలికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు పలువురు గాయపడ్డారు. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు.

బిజెపి వైప‌ల్యాల‌ను ప్ర‌జ‌లు గుర్తిస్తున్నారు..

కాగా వేణుగోపాల్ బిజెపి తీరుపై ధ్వ‌జ‌మెత్తారు. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి స‌హించ‌లేక ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని బిజెపి నేత‌ల‌పై మండి ప‌డ్డారు. యాత్ర‌లో రాహుల్ లేవ‌నెత్తుతున్న ప్ర‌శ్న‌ల‌కు బిజెపి నేత‌ల వ‌ద్ద జ‌వాబులు లేవ‌ని, అందుక‌నే విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నార‌ని అన్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, ప్ర‌భుత్వ సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ‌, మ‌హిళ‌ల‌పై దాడులు, అకృత్యాల వంటి అంశాల‌పై బిజెపి నేత‌లు నోరెత్త‌డం లేద‌న్నారు. రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటున్నార‌ని, వారు రాహుల్ వాద‌న‌ను స‌మ‌ర్ధిస్తున్నార‌ని వేణు గోపాల్ అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి బిజెపి బెంబేలు ప‌డుతోంద‌ని అన్నారు.

సైక్లిస్టుగా మారిన రాహుల్‌!

రాహుల్ గాంధీ చేస్తున్న భార‌త్ జోడో యాత్ర సోమ‌వారం నాటికి 82 వ రోజుకు చేరుకుంది. ఆయ‌న ప్ర‌స్తుతం మ‌ద్య ప్ర‌దేశ్ లోని ఇండోర్ లోయాత్ర‌లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సైక్లిస్టుగా మారి ప్ర‌జ‌ల‌ను ఉత్సాహ ప‌రిచారు. యాత్రలో భాగంగా రాహుల్ నిన్న మోవ్ లో మోటారు సైకిల్ న‌డిపిన విష‌యం తెలిసిందే. సోమ‌వారంనాడు ఆయ‌న సైకిల్ తొక్కుతూ కొద్ది సేపు యాత్ర‌లో పాల్గొన‌డంతో ప్ర‌జ‌లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. నినాదాల‌తో మ‌రింత ఉత్సాహంగా ఉర‌క‌లు వేశారు. కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై పూల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లో ప్రవేశించ‌డానికి వీలు లేద‌ని బాంబులు పేల్చిచంపేస్తామంటూ హెచ్చ‌రిక‌లు వ‌చ్చిన విష‌యం తెలిసింది. ఈ నేపథ్యంలో ఇండోర్ లో ఆయ‌న యాత్ర క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ద్య సాగుతోంది.

కన్యా కుమారిలో మొదలై మొత్తం 3500 కిలోమీట‌ర్ల ల‌క్ష్యంగా సాగుతున్న రాహుల్ యాత్ర క‌శ్మీర్ లో ముగియ‌నున్న‌ది. ఈ యాత్ర ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు, 34 జిల్లాలను కవర్ చేసింది.

First Published:  28 Nov 2022 1:26 PM IST
Next Story