జనవరి నుంచి నాజల్ వ్యాక్సిన్.. రేటెంతంటే.. ?
ఇంకొవాక్ సింగిల్ డోస్ టీకా రేటు 800 రూపాయలు. జనవరి నాలుగో వారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంకొవాక్ అందుబాటులో ఉంటుంది.
భారత్ లో కరోనా భయాల వేళ, మరోసారి టీకా వ్యవహారం హైలెట్ అవుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే బూస్టర్ డోస్ రెడీ చేసి పంపిణీ మొదలు పెట్టాయి. కేంద్రం కేవలం బీ అలర్ట్ అని ప్రకటించి సైలెంట్ గా ఉంది. ఇటు వ్యాక్సిన్ విక్రేతలు కొత్త బ్రాండ్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్నారు. తాజాగా భారత్ బయోటెక్ తయారీ నాజల్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. జనవరి నాలుగో వారం నుంచి ఈ నాజల్ వ్యాక్సిన్ ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు భారత్ బయోటెక్ ప్రతినిధులు.
ఇంకొవాక్..
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ టీకా ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. దీనితోపాటు సీరమ్ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ కూడా భారత్ లో విరివిగా ఉపయోగించారు. ఇప్పుడు కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండే సరికి భారత్ బయోటెక్ సంస్థ ఇంకొవాక్(బీబీవీ154) అనే కొత్తరకం టీకాను మార్కెట్లోకి తెస్తోంది. ఇది ముక్కు ద్వారా తీసుకునే టీకా. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నాజల్ వ్యాక్సిన్ ని బూస్టర్ డోస్ గా ఇవ్వొచ్చంటూ ఇటీవలే కేంద్రం అనుమతి ఇచ్చింది.
రేటెంత..?
నాజల్ వ్యాక్సిన్ ని రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కొవాక్సిన్ లేదా కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకొవాక్ ని బూస్టర్ డోస్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకొవాక్ సింగిల్ డోస్ టీకా రేటు 800 రూపాయలు. స్థానిక పన్నులు దీనికి అదనం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం భారత్ బయోటెక్ సంస్థ 320 రూపాయలకే దీన్ని అమ్ముతామంటోంది. జనవరి నాలుగో వారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంకొవాక్ అందుబాటులో ఉంటుంది. జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే ఈ నాజల్ వ్యాక్సిన్ సమర్దంగా పనిచేస్తుందా? లేదా భారత్ బయోటెక్ వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతుందా ? అని కొందరు వైద్య నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.