బేటీ బచావ్.. ట్రెండింగ్ లోకి హ్యాష్ ట్యాగ్
అక్కడ రేపిస్ట్‌లకు క్షమాభిక్ష పెట్టింది బీజేపీ పాలిత రాష్ట్రమే, ఇక్కడ రిసెప్షనిస్ట్ ని దారుణంగా చంపేసిన ప్రాంతం కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అందుకే బీజేపీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ టార్గెట్ అవుతోంది.
బేటీ బచావో- బేటీ పఢావో.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఇప్పుడు వారికే ఓ ప్రశ్నగా మారింది. ఉత్తరాఖండ్ లోని ఓ రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న యువతి హత్య నేపథ్యంలో బేటీ బచావ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. పైగా అది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రం. హత్య చేసింది కూడా బీజేపీ నేత సుపుత్రుడే కావడం మరీ దారుణం. అందుకే బీజేపీ ఇప్పుడు డబుల్ ట్రబుల్స్ ఎదుర్కొంటోంది. ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని అసమర్థ డబుల్ ఇంజిన్ సర్కారుగా పేరు తెచ్చుకుంది.
గతంలో బేటీ బచావో కార్యక్రమం ప్రచార ఆర్భాటంతో వార్తల్లోకెక్కింది. ఆ పథకానికి విడుదల చేసిన నిధుల్లో 80శాతం కేవలం ప్రచారానికే ఉపయోగించారనేది ప్రధాన ఆరోపణ. అది ఆరోపణ కాదు, నిజమేనని గణాంకాలు చెబుతున్నాయి. పోనీ ఆడపిల్లల రక్షణకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాయా అంటే అదీ లేదు. రేపిస్ట్ లు బ్రాహ్మణులు, సౌమ్యులు అనే కారణంతో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష పెట్టి విడుదల చేసేంత దయార్ద్ర హృదయం ఉన్న నాయకులు ఉన్నారు. అక్కడ రేపిస్ట్ లకు క్షమాభిక్ష పెట్టింది బీజేపీ పాలిత రాష్ట్రమే, ఇక్కడ రిసెప్షనిస్ట్ ని దారుణంగా చంపేసిన ప్రాంతం కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలోకే రావడం విశేషం. అందుకే బీజేపీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ టార్గెట్ అవుతోంది.
బేటీ బచావ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు, రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యని అరెస్ట్ చేశారు పోలీసులు. వినోద్ ఆర్యపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంది పార్టీ. ఆ రిసార్ట్ పైకి బుల్డోజర్లు పంపించారు అధికారులు. విషయం పెద్దదై, విమర్శలొచ్చాక జరిగిన పనులు ఇవి. మరి ఆ ప్రాణం ఎవరు తిరిగి తెస్తారు. నాయకుల కొడుకులే ఇంత క్రూరంగా హత్యలు చేయడానికి సిద్ధపడితే ఇక వారి అనుచరులు ఎలా ఆలోచిస్తారు. ఇలాంటి రాష్ట్రాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి..? బేటీ బచావో - బేటీ పఢావో అంటూ ప్రచారంలో జోరు చూపించడం కాదు, కనీసం వాస్తవంలో బేటీ బచావోకి అర్థం చెప్పేలా ఉంటేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అప్పటి వరకూ ఇలాంటి అసమర్థ పథకాలు, అసమర్థ పాలకుల వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం ఉండదు.