Telugu Global
National

ఆ ఊరి ప్రజలకు చిరుతలే దైవం.. ఆలయాలు కట్టి పూజలు

బెరా గ్రామ ప్రజలు చిరుతలను తమ దైవంగా భావిస్తారు. ఆలయాల్లో చిరుతల విగ్రహాలు, బొమ్మలు పెట్టి పూజలు చేస్తుంటారు. చిరుతలు పశువులను, గొర్రెలను వేటాడుతున్నప్పుడు అడ్డుకోరు.పైగా అది దైవబలిగా భావిస్తారు.

ఆ ఊరి ప్రజలకు చిరుతలే దైవం.. ఆలయాలు కట్టి పూజలు
X

మామూలుగా ఊర్ల సమీపంలోకి చిరుత వచ్చిందని వింటేనే హడలిపోతాం. ఇక కనిపించిందంటే అందరూ ఏకమై అడవి వరకు తరిమికొడతాం. అది ఊరి దాటి పోయే వరకు కంటి మీద కునుకు కూడా పట్టదు. కానీ ఆ గ్రామంలో మాత్రం చిరుతలు జనం మ‌ధ్యే స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. రోడ్లపై అటు ఇటు తిరుగుతూ, పొలాల వద్ద, బావుల వద్ద కనిపిస్తూ ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఆ చిరుతలు మనుషులపై దాడులు చేయవు. మనుషులు కూడా పక్కనే చిరుతలు వెళ్తున్నాయని భయపడరు. పైగా వాటికి ఏదైనా అపాయం కలిగితే కాపాడటంలో ముందుంటారు.

రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లా బెరా గ్రామం ఆరావళి పర్వత ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ అధికంగా రబారి జాతి ప్రజలు నివసిస్తుంటారు. వీరి ప్రధాన వృత్తి గొర్రెలు, పశువుల పెంపకం. 50 ఏళ్ల కిందట కుంభాల్ గడ్ జాతీయ పార్కు నుంచి తప్పించుకున్న ఆరు చిరుతలు బెరా గ్రామ సమీపంలోకి వచ్చాయి. అక్కడ కొద్దిపాటి అటవీ ప్రాంతం, కొండ గుహలు ఉండడంతో చిరుతలు అక్కడే తిష్ట వేశాయి.

పైగా బెరా గ్రామ ప్రజలు చిరుతలను తరిమే ప్రయత్నం చేయలేదు. దీంతో కాలక్రమేణా గ్రామ ప్రజలకు, చిరుతలకు మధ్య సఖ్యత ఏర్పడింది. చిరుతలకు ప్రజలు ఎటువంటి హాని కలిగించకుండా సంరక్షిస్తూ వచ్చారు. చిరుతలు కూడా మనుషులు కనిపిస్తే పక్కనుంచి వెళ్తాయే తప్ప దాడి మాత్రం చేయవు. మొదట్లో ఆరు చిరుతలు బెరా గ్రామానికి రాగా 2020 కల్లా వాటి సంఖ్య 60కి చేరింది.

ఇప్పుడు బెరా గ్రామం ప్రపంచంలోనే ఎక్కువ చిరుతలు నివసించే ప్రాంతంగా మారింది. అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని జవాన్ లెపర్డ్ కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు. పర్యాటకులకు చిరుతలను చూపించేందుకు కొందరు సఫారీలు కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న చిరుతలను చూసేందుకు పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో బెరా గ్రామానికి వస్తున్నారు.

చిరుతలకు ఆలయాలు కట్టి పూజలు

బెరా గ్రామ ప్రజలు చిరుతలను తమ దైవంగా భావిస్తారు. ఆలయాల్లో చిరుతల విగ్రహాలు, బొమ్మలు పెట్టి పూజలు చేస్తుంటారు. చిరుతలు పశువులను, గొర్రెలను వేటాడుతున్నప్పుడు అడ్డుకోరు.పైగా అది దైవబలిగా భావిస్తారు. తమ వద్ద నుంచి ఒక పశువును చిరుత తీసుకెళ్తే అందుకు ప్రతిగా దేవుడు మరో రెండు ప్రసాదిస్తాడని ప్రజలు నమ్ముతారు. చిరుతల దాడిలో పశువులు చనిపోతుండటంతో రాజస్థాన్ ప్రభుత్వం వన్ ధన్ యోజన అనే పథకాన్ని అమలు చేసి మేక చనిపోతే 4 వేలు, ఆవు చనిపోతే 15 వేలు అందజేస్తోంది. అయితే ఈ పరిహారం తీసుకోవడానికి కూడా ఊరి ప్రజలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం.

First Published:  22 March 2023 2:22 PM IST
Next Story