Telugu Global
National

రామేశ్వరం కేఫ్‌ బాంబ్ బ్లాస్ట్‌ కేసు.. నిందితుడిని పట్టించిన టోపీ

నిందితులిద్దరినీ ఓ క్యాప్‌ పట్టించింది. దానిని కొనడానికి వెళ్లినప్పుడు సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరు తరచూ సిమ్‌ కార్డులు మార్చుతూ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లేందుకు యత్నించినప్పటికీ.. NIA రాడార్‌ నుంచి వారు తప్పించుకోలేకపోయారు.

రామేశ్వరం కేఫ్‌ బాంబ్ బ్లాస్ట్‌ కేసు.. నిందితుడిని పట్టించిన టోపీ
X

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. మాస్టర్ బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్, పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను NIA అదుపులోకి తీసుకుంది. మార్చి ఒకటో తేదీన బ్లాస్ట్ జరిగింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు.. అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

పట్టించిన క్యాప్‌..!

నిందితులిద్దరినీ ఓ క్యాప్‌ పట్టించింది. దానిని కొనడానికి వెళ్లినప్పుడు సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరు తరచూ సిమ్‌ కార్డులు మార్చుతూ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లేందుకు యత్నించినప్పటికీ.. NIA రాడార్‌ నుంచి వారు తప్పించుకోలేకపోయారు. పేలుడుకు మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంత వాసి అని ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడని పేర్కొంది.

మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో బ్లాస్ట్ జరిగింది. ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కేసును కర్ణాటక హోంశాఖ NIAకి అప్పగించింది. నిందితుడు RDX ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. అతడు ఏ మార్గంలో కేఫ్‌లోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను విచారించారు. కేఫ్‌లో బాంబర్‌ అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న బ్యాగ్‌ను అక్కడపెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. ఈ క్రమంలో ఐదు కిలోమీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరాల ఫుటేజీని NIA అధికారులు పరిశీలించారు. క్యాప్‌ పెట్టుకున్న వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలుపెట్టారు. వాళ్లు ఆ క్యాప్‌ కొంటున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి. దీంతో నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు.

First Published:  12 April 2024 2:54 PM IST
Next Story