Telugu Global
National

మీకు కన్నడ రాదా..? అయితే చెన్నైకో, హైదరాబాద్‌కో వెళ్లి బతకండి.. యువ జంటకు పోలీస్ ఆఫీసర్ వార్నింగ్

యువ జంట ఇచ్చిన సమాధానంతో ఆ పోలీస్ ఆఫీసర్ మరింత రెచ్చిపోయాడు. మేము ముందు కన్నడిగులమని.. ఆ తర్వాతే భారతీయులమని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మీకు కన్నడ రాదా..? అయితే చెన్నైకో, హైదరాబాద్‌కో వెళ్లి బతకండి.. యువ జంటకు పోలీస్ ఆఫీసర్ వార్నింగ్
X

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ యువ జంట కన్నడ భాషలో మాట్లాడనందుకు వారిని తమ రాష్ట్రం వదిలి వెళ్లాలని ఓ పోలీసు ఆఫీసర్ వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. బెంగళూరులో ఉంటూ కన్నడ మాట్లాడక పోయినంతమాత్రాన రాష్ట్రం వదిలి వెళ్లాలని చెప్పడం ఏంటని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. యువ జంట పట్ల పోలీసు ఆఫీసర్ ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బెంగళూరులో ఇటీవల ఓ యువ జంట బైక్ పై వెళ్తుండగా వారిని ఓ పోలీసు అధికారి ఆపాడు. యువ జంట ఇంగ్లీషులో మాట్లాడటంతో కన్నడలో మాట్లాడాలని పోలీసు అధికారి వారికి సూచించాడు.

అయితే యువతి, యువకుడు తమకు కన్నడ రాదని చెప్పారు. దీంతో వారిపై పోలీస్ ఆఫీసర్ ఫైర్ అయ్యాడు. కన్నడ రానివారు బెంగళూరులో ఉండవద్దని హెచ్చరించాడు. నగరాన్ని వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవాలని సూచించాడు. చిన్న విషయానికే పోలీస్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఆ యువ జంట కూడా గట్టిగానే స్పందించింది. మేము భారతీయులం.. కర్ణాటక కూడా భారతదేశంలో భాగమే కదా.. మేము ఇక్కడ ఉండటానికి అభ్యంతరం ఏంటి..? అని ప్రశ్నించింది.

యువ జంట ఇచ్చిన సమాధానంతో ఆ పోలీస్ ఆఫీసర్ మరింత రెచ్చిపోయాడు. మేము ముందు కన్నడిగులమని.. ఆ తర్వాతే భారతీయులమని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడ కన్నడలో మాట్లాడకపోతే మీలాంటి వారికి చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయని.. అక్కడికి వెళ్లి బతకాలని సూచించాడు. కాగా, యువ జంటతో పోలీసు ఆఫీసర్ మాట్లాడుతున్నప్పుడు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కన్నడ రాకపోయినంత మాత్రాన కర్ణాటకలో ఉండకూడ‌ద‌ని పోలీస్ ఆఫీసర్ హెచ్చరిక చేయడం పట్ల సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో ఇటువంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఈనెల 7వ తేదీ కూడా బీహార్ రాష్ట్రం ముజఫర్ నగరానికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో తనకు జరిగిన అవమానం పట్ల ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తాను స్థానికంగా ఒక రెస్టారెంట్‌లో పని చేస్తున్నానని.. అయితే తాను అక్కడ హిందీలో మాట్లాడుతుండటంతో తనను ఇక్కడి వారు అంటరాని వాడిగా చూస్తున్నారని వాపోయాడు. అంతా ఒకే దేశం అయినప్పుడు ఎక్కడైనా నివసించే హక్కు, ఏ భాషలో అయినా మాట్లాడే హక్కు ఉన్నాయి కదా.. అని అతడు ప్ర‌శ్నించాడు.

First Published:  18 April 2023 7:08 AM GMT
Next Story