'టచ్ చేసి చూడండి..బెంగాల్ టైగర్స్ మిమ్మల్ని మింగేస్తాయి':బిజెపికి మమత స్ట్రాంగ్ వార్నింగ్!
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని బీజేపీ నాయకులు చేసిన ప్రకటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. నన్ను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఆమె బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ లో బిజెపి ఆటలు సాగవని, కావాలంటే ప్రయత్నించుకోవచ్చని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన మంత్రి పార్ధా ఛటర్జీ అరెస్టు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సువేందు అధికారి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు.
మహారాష్ట్రలో శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తర్వాత చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఆ తర్వాత వరసలో బెంగాల్ ఉన్నాయని అధికారి చేసిన వ్యాఖ్యలు ఆమె ఆగ్రహానికి కారణమయ్యాయి. మంగళవారంనాడు ముఖ్యమంత్రి ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ బిజెపిపై మండిపడ్డారు.
"ఈ సారి మహారాష్ట్ర సరిగ్గా పోరాడలేకపోయింది. ఇక్కడికి(బెంగాల్ లోకి)ప్రవేశించడానికి ప్రయత్నించి చూడండి. మీరు బంగాళాఖాతం దాటి రావాల్సిందే. మొసళ్ళు మిమ్మల్ని కరుస్తాయి. సుందర్‌బన్స్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మిమ్మల్ని మింగేస్తుంది. ఉత్తర బెంగాల్‌లో ఏనుగులు మీపైకి దూకి తొక్కేస్తాయి." అని ఆమె హెచ్చరించారు. పాఠశాల ఉద్యోగాల స్కాంలో ఆమె మంత్రివర్గ సహచరుడు పార్థా చటర్జీని అర్ధరాత్రి అరెస్టు చేయడం, ఆయన్ను ఆస్పత్రుల చుట్టూ తిప్పడం లో కేంద్రప్రభుత్వ సంస్థ ఈడి తీరును మమత తప్పుబట్టారు. ఈ చర్యలు బిజెపి వైఖరి ఏంటో తెలియ జేస్తున్నాయని అన్నారు.
రాష్ట్ర మంత్రిని భువనేశ్వర్ ఎయిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లారని ఆమె ప్రశ్నించారు. "కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లాలి? ఈఎస్‌ఐ ఆసుపత్రికి , కమాండ్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళారు? దీని వెనక ఉన్నఉద్దేశ్యం ఏమిటి? ఇది బెంగాల్ ప్రజలను అవమానించడం కాదా? మీరు ఏమనుకుంటున్నారు? కేంద్రం అమాయకంగాను .. రాష్ట్రాలు అన్నీ దొంగలుగా కనబడతున్నాయా..? రాష్ట్రాల కారణంగానే మీరు అక్కడ ఉన్నారు అని గుర్తుంచుకోవాలి" అని బిజెపిపై మమత ధ్వజమెత్తారు.
పార్థా ఛటర్జీని అరెస్టు చేసిన రాత్రి ఆయన మమతకు మూడు సార్లు ఫోన్ చేశారని కానీ ఆమె జవాబివ్వలేదని కోల్ కత్తా హైకోర్టుకు సమర్పించిన మెమోలో ఈడీ పేర్కొంది. ఛటర్జీతో దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని అనిపిస్తోందని అనుకుంటున్నారు. ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత మమత ఈడీ, బిజెపి పై విరుచుకుపడ్డారు.