Telugu Global
National

యూపీ : ఇద్దరు చిన్నారులను హత్య చేసిన వ్యాపారి ఎన్ కౌంటర్

ఇప్పటి వరకు యోగి ప్రభుత్వం సుమారు 200 మందిని ఎన్ కౌంటర్ చేసింది. సర్కారు తీరుతో భయపడుతున్న నేరస్తులు జైళ్లలోంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు.

యూపీ : ఇద్దరు చిన్నారులను హత్య చేసిన వ్యాపారి ఎన్ కౌంటర్
X

ఉత్తరప్రదేశ్ లో ఎన్ కౌంటర్లు ఆగడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా యోగి ఆదిత్య నాథ్ సర్కార్ పట్టించుకోవడం లేదు. నేరస్తులను ఏరివేస్తూనే ఉంది. ఇటీవ‌ల ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను హత్య చేసిన నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. యూపీలో యోగి సీఎం అయిన తర్వాత నేరస్తులను ఏరివేసే పని చేపట్టారు. గ్యాంగ్ స్టర్లు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, రౌడీల లిస్ట్ తీసి వరుసగా ఎన్ కౌంటర్ చేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిని వదలడం లేదు.

ఇప్పటి వరకు యోగి ప్రభుత్వం సుమారు 200 మందిని ఎన్ కౌంటర్ చేసింది. సర్కారు తీరుతో భయపడుతున్న నేరస్తులు జైళ్లలోంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. చాలా మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో యూపీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. రాష్ట్రంలోని లక్నోలో బాబా కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో 12, 8 ఏళ్ల వయస్సున్న ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటుండగా వ్యాపారి వారిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి చంపాడు. ఘటన తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఆగ్రహం చెందిన స్థానికులు వ్యాపారి దుకాణాన్ని దహనం చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న లక్నో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టగా.. వారిపై అతడు కాల్పులకు దిగాడు. పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగి నిందితుడిని ఎన్ కౌంటర్ చేశారు. కాగా, వ్యాపారి ఇద్దరు చిన్నారులను ఎందుకు హత్య చేశాడనే విషయమై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు.

First Published:  20 March 2024 10:24 AM IST
Next Story