బ్యాంకు ఉద్యోగులకు 5 రోజులే పని దినాలు..! శని, ఆదివారాలు మూసివేతేనా?
తాజాగా జరిగిన చర్చల్లో ఇకపై బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులే పని దినాలు ఉండటానికి ఐబీఏ అంగీకారం తెలిపింది.
దేశంలోని బ్యాంకు ఉద్యోగులందరికీ ఇకపై వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు నెలలో ఆదివారంతో పాటు రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు. కాగా, డిజిటల్ లావాదేవీలు పెరిగి.. కస్టమర్లు బ్యాంకులకు రావడం తగ్గిన తర్వాత కూడా వారానికి ఆరు రోజులు పని చేయడంపై ఉద్యోగ సంఘాలు తమ నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ మధ్య చర్చలు జరిగాయి.
తాజాగా జరిగిన చర్చల్లో ఇకపై బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులే పని దినాలు ఉండటానికి ఐబీఏ అంగీకారం తెలిపింది. నెలలోని అన్ని శని, ఆదివారాలు సెలవులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఈ మేరకు మిగిలిన ఐదు రోజుల్లో పని సమయం పెంచుతామని పేర్కొన్నది. కాగా, వారానికి ఐదు రోజుల పని దినాల ఒప్పందం అమలులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేశంలోని పలు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే హెడ్‌గా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరి. కేంద్రం ఓకే చేసిన తర్వాత శని, ఆదివారాలు బ్యాంకులు పూర్తిగా మూతబడనున్నాయి.
వారానికి ఐదు రోజుల పని దినాల ఒప్పందం అమలులోకి వస్తే.. రోజుకు 40 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎల్ఐసీ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. పాశ్చాత్య దేశాల ఎకానమీస్, ట్రేడింగ్‌తో అనుకూలంగా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్లు తెలియజేస్తున్నాయి. కాగా, ఐదు రోజుల పని దినాలు అమలుకు ముందే క్యాష్ డిపాజిట్ మెషిన్లు, పాస్ బుక్ ప్రింటింగ్ మెషిన్లతో పాటు ఏటీఎంల సంఖ్య పెంచాలని.. కస్టమర్లకు సెల్ఫ్-సర్వీస్ బ్యాంకింగ్‌పై మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐబీఏ సిఫార్సు చేసింది.