వరదల్లో కొట్టుకుపోయి నగలు.. గోల్డ్ షాప్ యజమాని లబోదిబో
2కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి, వజ్రాభరణాలు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. షట్టర్లు కాస్త ముందుగా దించి ఉంటే నీరు లోపలికి వచ్చినా నగలు కొట్టుకుపోయేవి కావని అంటున్నాడు యజమాని
భారీ వర్షాలు, వరదల సమయంలో ఇళ్లలోని వస్తువులన్నీ కొట్టుకుపోయిన ఉదాహరణలు చాలానే చూశాం. షాపుల్లో వస్తువులు తడిచిపోయి పాడైపోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ బెంగళూరులో వరలదలకు ఏకంగా ఓ బంగారం షాపు తుడిచిపెట్టుకుపోయింది. షాపులో నగలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అసలు వరదల సమయంలో యజమాని అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నాడు..? గోల్డ్ షాప్ కి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది కదా.. అయినా కూడా నగలు ఎలా కొట్టుకుపోయాయి..?
బెంగళూరులోని మల్లేశ్వర్ ప్రాంతానికి చెందిన నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. అయితే వర్షపు నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో దుకాణం మూసేందుకు కూడా సమయం దొరకలేదు. షట్టర్లు దించేలోగా ఒక్కసారిగా వరదనీరు షాపులోకి వచ్చింది. అదే స్పీడ్ తో నగల్ని కూడా తీసుకెళ్లింది. షాపులో పనిచేసేవారు భయపడి తమ ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీశారు. పాపం యజమాని లబోదిబోమంటున్నాడు. 2కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి, వజ్రాభరణాలు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. షట్టర్లు కాస్త ముందుగా దించి ఉంటే నీరు లోపలికి వచ్చినా నగలు కొట్టుకుపోయేవి కావని అంటున్నాడు యజమాని.
ఆ షాపుకి దగ్గర్లోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ చెత్తాచెదారంతో కలసి వరదనీరు రావడంతో ఏమీ చేయలేకపోయామని, నగలన్నీ కళ్లముందే నీళ్లల్లో కొట్టుకుపోతున్నా కాపాడుకోలేని పరిస్థితి అని ఆ దుకాణం యజమాని విలవిలలాడిపోతున్నాడు. అయితే అదృష్టంకొద్దీ ఆ షాపులో ఉన్నవారి ప్రాణాలు మాత్రం నిలిచాయి. వరదలతో నష్టం జరిగింది కాబట్టి, కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావని బాధపడుతున్నాడు గోల్డ్ షాప్ యజమాని.
బెంగళూరు వరదల్లో ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిణి సహా మొత్తం ఐదుగురు మరణించారని అధికారిక సమాచారం. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం తగ్గినా వరదనీటి ప్రవాహం మాత్రం ఇంకా అలాగే ఉందు, కొన్నిచోట్ల రోడ్లపై నడుము లోతు నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.