కర్ణాటక ఎన్నికలు: ఎమ్మెల్యేవా..? అయితే ఏంటీ..? క్యూ లైన్‌లో వచ్చి ఓటెయ్
బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు అతి తక్కువగా పోలింగ్ నమోదు కాగా.. 11 గంటల తర్వాత పోలింగ్ ఊపందుకుంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓటు వేయడానికి వచ్చిన ఓ బీజేపీ ఎమ్మెల్యేకి ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
పోలింగ్ బూత్ వద్దకు కారులో వచ్చిన ఎమ్మెల్యే నేరుగా వాహనం దిగి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ క్యూలైన్లో ఉన్న కొందరు మహిళలు ఆయనను అడ్డుకున్నారు. మీరు ఎమ్మెల్యే కావచ్చు.. అయినా సరే క్యూ లైన్ లో నిలబడి ఓటెయాల్సిందే.. అని వారు చెప్పడంతో చేసేదేమీలేక ఆయన క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.
బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆ తర్వాత ఆయన బనశంకరి రెండో స్టేజ్ లోని బూత్ నంబర్ 145 వద్దకు వచ్చారు. ఇక్కడే ఆయనకు ఓటు హక్కు ఉంది. కృష్ణప్ప ఓటు వేసేందుకు నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ క్యూ లైన్లో ఉన్న కొందరు మహిళలు ఆయనను అడ్డుకున్నారు.
ఓటు వేయడానికి మండుటెండను కూడా లెక్క చేయకుండా క్యూలైన్లో వేచి ఉన్నామని, మీరు కూడా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయాలని కోరారు. నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని అని కృష్ణప్ప చెప్పగా.. ఎమ్మెల్యే అయితే ఏంటీ..? క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయాల్సిందే.. అని మహిళలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఊహించని విధంగా ఎదురైన ఈ సంఘటనతో ఎమ్మెల్యే బిత్తరపోయారు. మహిళలతో వాగ్వాదం కొనసాగిస్తే తనకే నష్టం జరుగుతుందని గ్రహించిన ఎమ్మెల్యే చివరికి క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.