Telugu Global
National

హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం.. మెసేజ్ లు కూడా

మొబైల్ నుంచి టెక్స్ట్ మెసేజ్ లు కూడా వెళ్లకుండా చేయాలంటూ ఆయా నెట్ వర్క్ లను ఆదేశించింది ప్రభుత్వం. దీంతో హర్యానాలో 4 జిల్లాల్లో సమాచారం పూర్తిగా ఆగిపోయింది. ఈనెల 5 వరకు ఇదే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది.

హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం.. మెసేజ్ లు కూడా
X

అల్లర్లు, ఆందోళనల్లో మణిపూర్ స్థానాన్ని ఇప్పుడు హర్యానా భర్తీ చేస్తోంది. మూడు రోజులుగా హర్యానా టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో ఆరుగురు చనిపోగా 170మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నూహ్ జిల్లాలో మొదలైన ఘర్షణలు క్రమంగా ఫరీదాబాద్, పల్వాల్, సోహ్నా, పటౌడీ, గురుగ్రామ్ కి వ్యాపించడంతో ఆయా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ ని ప్రభుత్వం నిషేధించింది. మొబైల్ నుంచి టెక్స్ట్ మెసేజ్ లు కూడా వెళ్లకుండా చేయాలంటూ ఆయా నెట్ వర్క్ లను ఆదేశించింది. దీంతో హర్యానాలో 4 జిల్లాల్లో సమాచారం పూర్తిగా ఆగిపోయింది. ఈనెల 5 వరకు ఇదే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది.


అంతకంతకూ పెరుగుతున్న అల్లర్లు..

నూహ్ జిల్లాలో మొదలైన ఘర్షణలను అదుపు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కుట్రకోణం ఉందంటున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, శాంతి భద్రతలను అదుపు చేయడంలో చేతులెత్తేశారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలంటే పోలీసులకు, సైన్యానికి సాధ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చారు. అల్లర్లను అరికట్టడంలో పోలీసులతోపాటు సాధారణ పౌరుల భాగస్వామ్యం కూడా అవసరమనేది తన మాటల అంతరార్థం అన్నారు. ప్రస్తుతం సీఎం ఖట్టర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయన రాజీనామాకు డిమాండ్లు పెరిగాయి.

అల్లర్ల నేపథ్యంలో ఇప్పటి వరకు 116 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లరి మూకలనుంచే బాధితులకు పరిహారం ఇప్పిస్తామంటున్నారు సీఎం ఖట్టర్. డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా కూడా హర్యానాలో బీజేపీ శాంతిభద్రతల స్థాపనలో విఫలమైందని విమర్శలు వినపడుతున్నాయి. ఈ అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వ చర్యలు ఫలించలేదు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం హర్యానా వాసుల్ని వెంటాడుతోంది.

First Published:  3 Aug 2023 8:17 AM IST
Next Story