హిందూ యువతితో కలిసి ఉన్న ముస్లిం యువకుడు.. చితకబాదిన భజరంగ్ దళ్ కార్యకర్తలు..
ఇండోర్ లోని ఓ కేఫ్ లో ఓ ముస్లిం యువకుడు హిందూ యువతితో కలిసి మాట్లాడినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. అతన్ని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు.
మధ్యప్రదేశ్ లో హందుత్వవాదుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ ముస్లిం యువకుడు హిందూ యువతితో కలిసి మాట్లాడుతున్నాడంటూ భజరంగదళ్ కార్యకర్తలు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇండోర్ లోని ఓ కేఫ్ లో ఓ ముస్లిం యువకుడు హిందూ యువతితో తరచూ కలుస్తున్నాడంటూ భజరంగదళ్ కార్యకర్తలకు సమాచారం అందింది.
ఆదివారంనాడు ఆ కేఫ్ లో ఆ యువతీ, యువకులు ఉన్న సమయంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడి దగ్గరకు వెళ్లి పేరు చెప్పాలని కోరారు. తన పేరు కాశీ అని చెప్పాడు ఆ యువకుడు. నిజమైన పేరు చెప్పాలని గట్టిగా నిలదీశారు. ఆ యువకుడు భయపడుతూ నిలుచోగా చివరికి ఆ యువకుడి వద్ద ఉన్న గుర్తింపు కార్డును తీసుకొని చూశారు.
అందులో అతడి పేరు ఖాసిం ఖాన్ అని ఉంది. దాంతో ఆ యువకుణ్ణి చితకబాదారు. యువకుడు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటపడి పట్టుకుని కొట్టి ఛత్రిపుర పోలీసులకు అప్పగించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో బజరంగ్ దళ్ కన్వీనర్ శర్మ వందలాది మంది కార్యకర్తలతో ఛత్రిపుర పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లవ్ జిహాదీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
కాగా నవంబర్ 19న ఇండోర్ లోని మేఘదూత్ గార్డెన్ లో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మేఘదూత్ గార్డెన్ లో ఓ హిందూ యువతితో ఓ ముస్లిం యువకుడు ఉన్నాడు. ఆ సమయంలో ఓ హిందూ సంస్థ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకున్నారు. అతడు కూడా తనను తాను హిందువునని చెప్పాడని ఓ ఆంగ్ల ఛానెల్ పేర్కొంది. భజరంగ్ దళ్ కార్యకర్తల ముందు యువకుడు తన గుర్తింపును దాచేందుకు ప్రయత్నించినా వారి ఒత్తిడికి భయపడి తాను ముస్లిం అని అంగీకరించాడని ఆ ఛానెల్ పేర్కొంది.