గార్బా వేడుకల్లో మైనార్టీ బౌన్సర్లపై భజరంగ్ దళ్ దాడి..
సూరత్‌లో గార్బా కార్యక్రమం వద్ద బౌన్సర్లుగా ఉన్న ముస్లిం యువకులను భజరంగ్ దళ్ కార్యకర్తలు గాయపరిచారు. గార్బా వేడుకలకు మీరెందుకు వచ్చారంటూ మండిపడ్డారు.
గార్బా వేడుకలకు ముస్లిం యువకులు దూరంగా ఉండాలని ఆ మధ్య బీజేపీ నేతలు హెచ్చరించారు. లవ్ జీహాదీకి అదే ఆద్యమని తప్పుడు ఆరోపణలు చేశారు. గార్భాకు వచ్చేవారంతా ఐడెంటిటీ కార్డులు తెచ్చుకోవాలని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లిం పురుషులు గార్భా వేడుకలకు రావాలంటే తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకురావాలంటూ కొత్త మెలిక పెట్టారు. ఇలా ఈ వ్యవహారం జరుగుతుండగానే పండగ వచ్చింది, గార్బా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే సూరత్‌లో గార్బా కార్యక్రమం వద్ద బౌన్సర్లుగా ఉన్న ముస్లిం యువకులను భజరంగ్ దళ్ కార్యకర్తలు గాయపరిచారు. గార్బా వేడుకలకు మీరెందుకు వచ్చారంటూ మండిపడ్డారు. నిర్వాహకులతో కూడా వారు వాగ్వాదానికి దిగారు.
సూరత్ లోని ఓ గార్బా వేడుక వద్ద ఈ ఘర్షణ జరిగింది. ఈ వేడుకల వద్ద ముస్లిం యువకులు బౌన్సర్లుగా ఉన్నారని తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. వారు బౌన్సర్ల పేర్లు అడిగారు. వారు హిందూ పేర్లు చెప్పారని, ఆ తర్వాత ఐడీ కార్డ్ లు అడగడంతో అసలు విషయం బయటపడిందని అంటున్నారు. అయితే ఇది కేవలం భజరంగ్ దళ్ కార్యకర్తల ఆరోపణ అని అంటున్నారు. కావాలనే అక్కడ ఉన్న ముస్లిం బౌన్సర్లపై వారు దాడికి దిగారని తెలుస్తోంది.
గుజరాత్ వ్యాప్తంగా గార్బా వేడుకలపై భజరంగ్ దళ్ ఆంక్షలు విధించింది. గార్బాకు ముస్లిం యువకులు రాకూడదని, కనీసం ముస్లిం బౌన్సర్లను కూడా మండపాల వద్ద ఉంచొద్దని నిర్వాహకులకు సూచించింది. భజరంగ్ దళ్ గుజరాత్ ప్రతినిధి హితేంద్రసింగ్ రాజ్ పుత్ పేరుతో వారికి ఆదేశాలు వెళ్లాయి. కానీ కొన్ని చోట్ల మైనార్టీలు బౌన్సర్లుగా ఉన్నారన్న సమాచారంతో భజరంగ్ దళ్ దాడికి ప్రయత్నించింది. సూరత్ లో జరిగిన దాడిలో ఓ బౌన్సర్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని, విచారణ చేపట్టామని, బాధ్యులను అరెస్టు చేస్తామని తెలిపారు సూరత్ డిప్యూటీ కమిషనర్ సాగర్ బాగ్మార్.