Telugu Global
National

మూడు నెలల జైలు జీవితం.. సంజయ్ రౌత్‌కు బెయిల్

శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం) ఎంపీ అయిన సంజయ్ రౌత్‌ను అగస్టు 1న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నది.

మూడు నెలల జైలు జీవితం.. సంజయ్ రౌత్‌కు బెయిల్
X

శివసేన సీనియర్ నాయకుడు, ఉద్దవ్ ఠాక్రేకు కుడి భుజం అయిన సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయిన రౌత్ మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిల్ కోసం స్పెషల్ కోర్టులో పిటిషన్ వేయగా అక్టోబర్ 21న వాదనలు విన్నది. అప్పుడు తీర్పును రిజర్వ్‌లో పెట్టిన కోర్టు.. ఇవ్వాళ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం) ఎంపీ అయిన సంజయ్ రౌత్‌ను అగస్టు 1న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నది. ముంబైలోని ఓ రెసిడెన్షియల్ కాలనీకి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు రౌత్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసినా.. ఆయన రెండు సార్లు వాటిని పక్కన పెట్టారు. తనపై అక్రమంగా ఈ కేసు బనాయించారని మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అని వాదించారు.

అదే సమయంలో శివసేనలోని శిండే వర్గం పార్టీని నిలువునా చీల్చింది. ఉద్దవ్ ఠాక్రేను సీఎం పదవి నుంచి తప్పించడమే కాకుండా పార్టీని కూడా హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించింది. మహారాష్ట్రకు శిండే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పార్టీని మాత్రం తన సొంతం చేసుకోలేక పోయారు. కాగా, శిండే వర్గం సంజయ్ రౌత్ మీదే పలు ఆరోపణలు చేసింది. ఆయన వల్లే పార్టీలో విభేదాలు పెరుగుతున్నట్లు చెప్పింది. ఇక ఉద్దవ్‌కు మొదటి నుంచి నమ్మిన బంటుగా ఉన్న రౌత్.. తానే షాడో సీఎంలా వ్యవహరించారు. బీజేపీతో పొత్తును వదిలి ఎన్సీపీతో కలవడానికి రౌత్ కారణమని శిండే ఆరోపించింది. దీంతో ఉద్దవ్‌పై తిరుగుబాటు చేసింది.

కాగా, సంజయ్ రౌత్ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఈడీ స్పష్టం చేసింది. పత్రాచాల్ డెవలప్‌మెంట్‌లో జరిగిన అవకతవకలతో పాటు.. మనీలాండరింగ్ కేసులు ఉన్నందునే అరెస్టు చేశామని చెప్పింది. దాదాపు రూ.1000 కోట్ల మేర అవినీతి జరిగినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నది.

First Published:  9 Nov 2022 3:05 PM IST
Next Story