Telugu Global
National

ఢిల్లీ విశ్వాసంతో మోదీకి మొట్టికాయ పడినట్టేనా..?

మోదీ-షా రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేశారు. చాపకిందకు నీళ్లు వస్తున్నాయని తెలుసుకున్న ఆయన, వెంటనే ఎమ్మెల్యేలను రక్షించుకున్నారు.

ఢిల్లీ విశ్వాసంతో మోదీకి మొట్టికాయ పడినట్టేనా..?
X

ఆపరేషన్ కమలం కాస్తా ఆపరేషన్ కిచిడ్ గా మారింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వాస పరీక్ష నెగ్గింది. కర్నాటక, మహారాష్ట్ర చేజిక్కిన తర్వాత, రీసెంట్ గా జార్ఖండ్ లో చిచ్చుపెట్టాలని చూస్తున్న బీజేపీ, ఢిల్లీవైపు కూడా ఓ చూపు చూసింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతున్న టైమ్ లో ఆమ్ ఆద్మీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలు బేరం పెట్టారంటూ ఆమ్ ఆద్మీ విమర్శలు చేస్తోంది. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలందర్నీ ఓ చోటకు చేర్చుకున్న కేజ్రీవాల్.. తనకు తానే విశ్వాస పరీక్ష పెట్టుకున్నారు, అందులో నెగ్గారు.

కేజ్రీవాల్ ముందు జాగ్రత్త..

మోదీ-షా రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేశారు. చాపకిందకు నీళ్లు వస్తున్నాయని తెలుసుకున్న ఆయన, వెంటనే ఎమ్మెల్యేలను రక్షించుకున్నారు. క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టకుండానే విశ్వాస పరీక్ష పెట్టుకుని పాసయ్యారు. బీజేపీకి షాకిచ్చారు. ఈ పరిణామంతో బీజేపీ దూకుడు తగ్గిస్తుందా, లేక ఇదే రీతిలో రాష్ట్రాలపై దండయాత్ర కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.

ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీకి 62మంది, బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో ఎంట్రీ కూడా లేకపోవడం విశేషం. విచిత్రం ఏంటంటే.. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ ని కూడా ఆప్ ఇలాగే కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీకి ఉన్న బలం ప్రకారం ఆ పార్టీని చీల్చాలంటే చాలా కష్టం. కానీ బీజేపీ ఆ ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. కానీ 20 కోట్ల‌ బేరం గురించి బీజేపీ ఎక్కడా ఎదురుదాడికి దిగలేదు. లోపాయికారీ ప్రయత్నం కచ్చితంగా జరిగిందనే అనుమానాలున్నాయి. అందులోనూ సిసోడియా మెడపై ఈడీ కత్తిపెట్టి, ఆయన్ను కేంద్రబిందువు చేసి పార్టీని చీల్చాలనే ప్రయత్నం కూడా జరిగిందని అంటున్నారు. స్వయంగా సిసోడియానే ఈ విషయం బయటపెట్టారు. తాను పార్టీ నుంచి బయటకొస్తే సీఎం సీటు, కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని ఆరోపించారు. మొత్తమ్మీద ఢిల్లీలో బీజేపీ పాచిక పారలేదని మాత్రం అర్థమవుతోంది. విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో కేజ్రీవాల్ పక్క రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరింత దూకుడు ప్రదర్శించే అవకాశముంది. ఏరికోరి కేజ్రీవాల్ ని కదిలించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నారు బీజేపీ నేతలు.

First Published:  2 Sept 2022 3:51 AM GMT
Next Story